హైడ్రా..హైడ్రా...హైడ్రా...ఈ పేరు తలచుకుంటేనే...హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ కట్టడాలనే నేలమట్టం చేస్తోంది. భూకబ్జా రాయుళ్ల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఎన్నో చెరువులకు పునర్ వైభవం తీసుకొచ్చింది. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడింది. దశాబ్దాలు కష్టపడి పేదలు నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా కూల్చివేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పెద్దోళ్లు కబ్జా భూములపైకి మాత్రం ప్రొక్లెయిన్లు వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.భూకబ్జాదారుల ఆటకట్టిస్తూ చెరువులను, నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షిస్తున్న హైడ్రాపై ఒక వైపు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు నిర్మాణాల కూల్చివేతల విషయంలో అనేక విమర్శలూ వస్తున్నాయి.
అక్రమ నిర్మణాలు కూల్చివేతలపై విధి విధానాలు సమర్పించే వరకు...ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దంటూ హైడ్రాకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయాలు, రోడ్ల పరిరక్షణ చర్యలు చేపట్టవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ....అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఎ షరీఫ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెల్లవారుజామున 4.30 సమయంలో భద్రతా సిబ్బంది, హైడ్రా అధికారులు రావడం ఏంటని ప్రశ్నించారు. వచ్చీ రావడంతోనే 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంకు, కాంపౌండ్ కూల్చివేస్తూ యుద్ధ సంఘటనను తలపించారని ఆరోపించారు.
ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. 36.37 ఎకరాలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని...పిటిషనర్లు వెయ్యికి పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి అనుమతులు లేవని, విద్యుత్ కనెక్షన్ అనుమతి కూడా లేదని వెల్లడించారు. ఇక్కడ ఉన్న ఏ నిర్మాణానికీ అనుమతులు లేవని కోర్టుకి తెలిపారు. పిటిషనర్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్‌లను న్యాయమూర్తి పరిశీలించారు. ఇందులో వందల కొద్దీ హైడ్రా సిబ్బంది...పిటిషనర్‌కు చెందిన పెద్ద భవంతిని హైడ్రా కూల్చివేసినట్లు గుర్తించారు.
సుప్రీంకోర్టు సహా ఇదే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై మార్గదర్శకాలను అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఒక భారీ కట్టడాన్ని కూల్చివేయడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని స్పష్టం చేశారు. అది అనధికార నిర్మాణమని భావించినప్పటికీ...అధికారులు మొదటి నుంచి ఎలా అనుమతించారనేది ఆశ్చర్యం కలిగిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆదిలోనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితులు అదుపులో ఉండేవన్నారు. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు అనధికార నిర్మాణమని, అందువల్ల కూల్చివేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కూల్చివేతలకు సంబంధించి వందకు పైగా కేసుల్లో హైడ్రా ప్రతివాదిగా ఉందని, ఇందులో ఏ ఒక్కదానిలోనూ ప్రామాణిక విధానాన్ని అనుసరించినట్లు లేదని న్యాయస్థానం తెలిపింది.
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్-374బి కింద హైడ్రాకు ప్రభుత్వం అధికారం అప్పగించిందని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా స్థానిక అధికారుల అధీనంలో ఉన్న భూముల రక్షణకు అధికారాలు అప్పగిస్తూ జీవోలు జారీ చేసిని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం...హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రామాణిక విధానం లేదని అభిప్రాయపడింది. కూల్చివేతలపై విధివిధానాలు సమర్పించే వరకు నీటి వనరులు, నాలాలు, రోడ్లు వంటి వాటి రక్షణ చర్యలు తప్ప...ఇతర ప్రాంతాల్లోని ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఐలాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా ఇటీవల కూల్చి వేసింది. ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండటం లేదని హైడ్రా గుర్తించింది. అధికారులు బుల్డోజర్లతో కూల్చి వేసేందుకు సిద్ధమయ్యే సరికి కొంతమందిని అద్దెకు దించి, నివాసాలున్నట్లుగా భవన నిర్మాణదారుడు చూపించాడు. అయినప్పటికీ బిల్డింగ్‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి అక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.