టీమిండియాకు గాయాల బెడద.. లంక టూర్ కు ఆ ప్లేయర్స్ ఔట్..!

శ్రీలంకతో త్వరలో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంకో రెండు రోజుల్లో భారత జట్టు ఎంపిక కానుంది. మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్టర్లు సమావేశం కానున్నారు.

Post Published By: dialnews
Updated : 27 July 2026, 8:25 PM IST

శ్రీలంకతో త్వరలో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంకో రెండు రోజుల్లో భారత జట్టు ఎంపిక కానుంది. మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్టర్లు సమావేశం కానున్నారు. ఈ పరిస్థితుల మధ్య టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు బోర్డుకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే టెస్టులపై దృష్టి సారించిన భారత్‌కు.. వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడటం పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది.శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15న ప్రారంభం కావాల్సి ఉంది. గాలే దీనికి వేదిక. రెండో టెస్టు అదే నెల 23 నుంచి 27 వరకు కొలంబో జరగాల్సి ఉంది. శ్రీలంక పిచ్‌లు సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు ఉండటం అత్యంత కీలకం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తుది జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు కత్తిమీద సాములా మారింది.

ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కుడి హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. లార్డ్స్‌ వన్డేకు ముందే అతను గాయపడ్డ విషయం తెలిసిందే. ఫలితంగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉండట్లేదు. రెండో టెస్టు నాటికి అతడు కోలుకుంటాడా లేదా అనేది పూర్తి ఫిట్‌నెస్ పై ఆధారపడి ఉంది.అటు పేసర్ జస్ ప్రీత్ బుమ్రా కూడా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో అతను జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30 వరకు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ బుమ్రాకు సూచించింది.

ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతని గాయం తాలూకు వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు గానీ కోలుకుంటున్నట్లు సమాచారం. పేస్ ఆల్‌రౌండర్లు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయాల కారణంగా ఈ పర్యటనకు పూర్తిగా దూరం అయ్యారు. హర్షిత్ రాణా హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతుండగా, నితీష్ రెడ్డి క్వాడ్రిస్ప్స్ గాయం నుంచి ఇంకా కోలుకోవట్లేదు.ఈ ఇద్దరూ జట్టులో ఉంటే పేస్ బౌలింగ్ విభాగంతో పాటు బ్యాటింగ్‌లోనూ బలం చేకూరేది గానీ.. ప్రస్తుతం సెలెక్షన్‌కు అందుబాటులో లేరు. వీరితో పాటు జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో బౌలింగ్ చేస్తూ గాయానికి గురైన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్, వెన్నునొప్పితో సతమతమవుతున్న హార్దిక్ పాండ్యా కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది. వెన్నునొప్పి తిరగబెట్టడంతో టెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నాడు. ఇలా ఒకేసారి నలుగురైదుగురు కీలక బౌలర్లు, ఆల్‌రౌండర్లు గాయాల జాబితాలో చేరడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 
  • 27 July 2026, 8:25 PM IST