'జల్దీ జల్దీ భాగో.. నయితో జో కర్నాహై సర్కార్ కరేగా'. బంగ్లా చొరబాటుదారులను నిలువునా వణికించిన సీఎం సువేందు మార్క్ మాస్ వార్నింగ్ ఇది. దీనర్థం "త్వర త్వరగా పారిపోండి.. లేకపోతే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది అని. ఆ హెచ్చరిక ఫలితం ఇస్తోంది. ఏళ్ల తరబడి బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశీ చొరబాటుదారులు సరిహద్దు చెక్ పోస్టులకు పోటెత్తుతున్నారు. వారందరినీ బంగ్లాదేశ్‌కు పంపించడానికి BSF సైతం యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కానీ, ఒకేసారి లక్షలాది మంది బంగ్లాదేశ్‌లోకి వెళ్లేందుకు ఢాకా తలుపులు తెరుస్తుందా అన్నదే ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న.
ఏళ్ల తరబడి బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశీ చొరబాటుదారులను సరిహద్దులకు పరుగులు పెట్టిస్తున్న హెచ్చరిక ఇదే. చొరబాటుదారులను గెంటేసే విషయమై.. నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి సువేందు మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల వద్ద గుమిగూడిన బంగ్లాదేశీయులు తిరిగి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశీలు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని లేకపోతే ప్రభుత్వమే అందుకు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అక్రమ చొరబాటుదారులను జైళ్లలో పెట్టి వారికి తిండిపెట్టడం వల్ల ప్రజాధనం వృధా చేయడమే అవుతుందన్నారు. అది నిజానికి భారతీయులకు ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు మేలు చేయదన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అక్రమ వలసదారులను తిప్పి పంపుతున్నట్లు సీఎం సువేందు క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత సరిహద్దులకు పరుగులు తీస్తున్న చొరబాటుదారుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
నిజానికి.. బెంగాల్లో ఉంటున్న అక్రమ వలసదారుల ఏరివేతకు సువేందు ప్రభుత్వం జిల్లాల వారీగా జైళ్ల లాంటి హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీంతో వందలాది మంది బంగ్లాదేశీలు స్వదేశానికి వెళ్లిపోవడానికి ఉత్తర 24 పరగణా జిల్లాలోని హకీంంపూర్ సరిహద్దు చెక్‌పోస్టు దగ్గరకు భారీ చేరుకుంటున్నారు. ఈ ప్రక్రియని రివర్స్ ఎక్సోడస్ అంటే వెనక్కి వెళ్లిపోవడం అని పిలుస్తున్నారు. భారత్‌లోకి అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి, ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లు తీసేసి, దేశం నుంచి వెళ్లగొడతామని ఇప్పటికే సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇందుకోసం 'డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్' పద్ధతిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మార్పు మొదలైంది. వాస్తవానికి.. గతేడాది ఎస్ఐఆర్ జరిగినప్పుడు కూడా బెంగాల్లో ఇలాంటి సీన్లే కనిపించాయి. మళ్లీ ఇప్పుడు గుంపులుగా కూర్చొని బంగ్లాదేశ్‌లోకి వెళ్లడానికి బీఎస్ఎఫ్ అధికారులు తమ పేర్లు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. కానీ, వారందరినీ తిరిగి బంగ్లాదేశ్‌కు ఎలా పంపించబోతున్నారు?
గతంలో చొరబాటుదారులు దొరికితే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపేవారు. కానీ సువేందు సర్కార్ తెచ్చిన కొత్త యంత్రాంగం ప్రకారం వ్యూహం మారింది. రాష్ట్ర పోలీసులకు లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు దొరికిన చొరబాటుదారులను కోర్టుకు తీసుకెళ్లకుండా వారిని నేరుగా BSF సరిహద్దు పోస్టులకు తరలిస్తారు. BSF అధికారులు అక్రమ వలసదారులను తమ ఆధీనంలోకి తీసుకుని, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో 'ఫ్లాగ్ మీటింగ్' నిర్వహిస్తారు. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం వారి జాతీయతను ధృవీకరించి, సరిహద్దు దాటించి అవతలి వైపునకు పంపేస్తున్నారు. భద్రతా బలగాల నుంచి అందిన నివేదికల ప్రకారం.. హకీంపూర్ బోర్డర్ చెక్‌పోస్టు వద్ద ఫస్ట్ బ్యాచ్‌లో సుమారు 50 మంది బంగ్లాదేశీయులను.. బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అధికారుల సమన్వయంతో సరిహద్దు దాటించారు. ప్రస్తుతం రెండవ బ్యాచ్‌గా ఉన్న వందలాది మంది అక్రమ వలసదారులు హకీంపూర్ చెక్‌పోస్ట్ దగ్గర BSF పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. ఒక్కసారి సరిహద్దు దాటిన తర్వాత మరోసారి భారత్‌లో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సరిహద్దుకు చేరుకున్న ప్రతి ఒక్కరి ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్లను సేకరిస్తున్నారు. ఫ్యూచర్లో వీరు మళ్లీ ఏ పేరుతోనైనా, ఏ డాక్యుమెంట్లతోనైనా భారత్‌లోకి అడుగుపెట్టకుండా శాశ్వత డిజిటల్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. BSF అధికారులు చొరబాటుదారులను గ్రూపులుగా విభజించి, వారందరి పూర్తి వివరాలను బంగ్లాదేశ్ భద్రతా దళాలకు అందిస్తున్నారు. BGB అధికారులు తమ దేశంలోని సంబంధిత జిల్లాల రికార్డులతో సరిచూసుకుని, వారు బంగ్లాదేశీయులేనని ధృవీకరించిన తర్వాతే గేట్లు తెరిచి లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తానికి, పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పక్క రివర్స్ ఎక్సోడస్, మరోపక్క డిటెన్షన్ అండ్ పుష్బ్యాక్ ప్రక్రియలు అధికారికంగా క్షేత్ర స్థాయిలో వేగం పుంజుకున్నాయి. సువేందు అధికారి మార్క్ '3D పాలసీ' ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, హకీంపూర్ బోర్డర్ చెక్‌పోస్ట్ సాక్షిగా ఆచరణలో కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం తుది వరకూ సజావుగానే సాగుతుందో లేక బంగ్లా పాలకులు తలతిక్క వేషాలేస్తారో చూడాలి.