యుద్ధం అంటే సైనికుల మధ్య పోరాటం అనుకున్నాం.. కానీ అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్న ఈ యుద్ధం పసిపిల్లల ప్రాణాలను బలితీసుకుంటోంది. యుద్ధం ప్రారంభం రోజుల్లో.. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై జరిగిన భీకర క్షిపణి దాడిలో 170 మంది చిన్నారులు కాలి బూడిదయ్యారు. ఆ పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కానీ, ఈసారి ఇరాన్ ఊరుకోలేదు. ప్రపంచ యుద్ధ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా, ఈ నరమేధానికి కారకులైన ఆ ఇద్దరు అమెరికా నేవీ అధికారుల పేర్లను, వారి ఫోటోలను ఇరాన్ ప్రపంచం ముందు బహిరంగపరిచింది.
అవును.. చరిత్రలో మొదటిసారి ఒక దేశం, మరో దేశపు కమాండర్ల ముఖాలను లోకానికి చూపించి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ప్రభుత్వం తన దౌత్య కార్యాలయాల ద్వారా అధికారికంగా ఆ ఇద్దరు అధికారుల వివరాలను వెల్లడించింది. వారిలో మొదటి వ్యక్తి క్యాప్టెన్ క్రిస్టోఫర్ ఎం. బాన్క్. ఇతను అమెరికా నేవీకి చెందిన డెస్ట్రాయర్ స్క్వాడ్రన్ 7 కమాండర్. రెండో వ్యక్తి క్యాప్టెన్ అలెక్స్ టోర్డెసిల్లాస్, యూఎస్ఎస్ స్ప్రూయన్స్ యుద్ధ నౌకకు కమాండింగ్ ఆఫీసర్. ఈ ఇద్దరి ప్రత్యక్ష ఆదేశాల మేరకే ఆ పాఠశాలపై మూడు క్షిపణులు వర్షంలా కురిశాయని ఇరాన్ ప్రకటించింది.
170 మంది ఆడపిల్లల ప్రాణాలు తీసిన ఈ 'హంతకుల'ను గుర్తుంచుకోండి అంటూ ఇరాన్ ప్రపంచానికి పిలుపునిచ్చింది. సాధారణంగా యుద్ధంలో వ్యూహకర్తల పేర్లు రహస్యంగా ఉంచుతారు. కానీ ఇరాన్ ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. 'ఈ ముఖాలను బాగా గుర్తుంచుకోండి.. అమాయకపు చిన్నారుల రక్తం చిందించిన వీరికి అసలు మనస్సాక్షి ఉందా..?' అని ఇరాన్ నిలదీసింది. 'రాత్రి పూట మీరు ప్రశాంతంగా నిద్ర ఎలా పోతున్నారు..? రేపు ఉదయం మీ సొంత బిడ్డల కళ్ళలోకి మీరు ధైర్యంగా చూడగలరా..?' అంటూ ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరి గుండెలను తాకుతున్నాయి.
ఇరాన్ చేస్తున్న ఈ పోరాటం కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ అధికారుల ఫోటోలతో కూడిన 'Wanted' పోస్టర్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఎంబసీల ద్వారా విడుదల చేసింది. అంటే, రేపు ఆ అధికారులు రిటైర్ అయ్యి ఏ దేశానికి వెళ్లినా, అక్కడ వారిని నేరస్థులుగానే చూసేలా ఇరాన్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ఈ అధికారుల వివరాలను స్థానిక భాషల్లో కూడా ప్రచారం చేశాయి.
దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ అధికారులపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం, వారిని 'యుద్ధ నేరస్థులు'గా ముద్ర వేయడం. అమెరికా ఎంతగా సమర్థించుకున్నా.. 170 మంది పసిమొగ్గలను తుంచేసిన పాపం వారిని వదలదు అంటుంది ఇరాన్. అలాగే ఈ దాడికి ఉపయోగించిన యుద్ధ నౌక యూఎస్ఎస్ స్ప్రూయన్స్ ఎక్కడ ఉందో, దాని కదలికలను ఇరాన్ నిరంతరం పర్యవేక్షిస్తోందని హెచ్చరించింది. "మీరు సముద్రం మధ్యలో ఉన్నా సరే, మా క్షిపణుల పరిధిలోనే ఉన్నారు" అని చెప్పడం ద్వారా ఆ నౌకలోని ప్రతి సైనికుడిలోనూ భయం నింపింది.
170 మంది పసిపిల్లల ప్రాణాలు తీసిన వారికి అదే స్థాయిలో శిక్ష ఉంటుందని, అది ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఊహించలేరని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా దీనిని 'టెక్నికల్ ఎర్రర్' అని చెప్పడాన్ని ఇరాన్ కొట్టిపారేసింది. "ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆయుధాలు, నిఘా వ్యవస్థ ఉన్న అమెరికాకు.. ఒక సైనిక స్థావరానికి, ఒక చిన్న పిల్లల పాఠశాలకు మధ్య తేడా తెలియదా?" అని ఇరాన్ ప్రశ్నించింది. ఇది ఉద్దేశపూర్వకంగా ఇరాన్ ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చేసిన దాడి అని ఆరోపించింది.
తమ టాప్ కమాండర్ల పేర్లు, ఫోటోలు ఇలా బహిరంగం కావడంతో అమెరికా రక్షణ శాఖ షాక్‌లో ఉంది. ఈ అధికారుల భద్రతకు ఇప్పుడు పెను ముప్పు పొంచి ఉంది. ఇరాన్ ఇప్పటికే 'Welcome to Hell' అనే నినాదంతో వారిని నరకానికి ఆహ్వానిస్తోంది. 'మా బిడ్డల ప్రాణాలు తీసిన వారికి ఈ భూమిపై నూకలు చెల్లాయి' అని ఇరాన్ సైన్యం ప్రతిజ్ఞ చేస్తోంది. 10,000 మంది సైనికులను పంపాలని చూస్తున్న ట్రంప్ ప్రభుత్వానికి, ఇరాన్ ఇచ్చిన ఈ షాక్ మామూలుది కాదు. ఇది కేవలం అధికారులకే కాదు, మొత్తం అమెరికా సైనిక వ్యవస్థకే ఒక హెచ్చరిక.