Top story:ట్రంప్ కు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్లిప్పర్ షాట్… ఘాలిబాఫ్ ఊర మాస్ పవర్ ఫుల్ కౌంటర్… ట్రంప్ vs ఘాలిబాఫ్, అసలేం జరిగింది..?

ఇరాన్‌లో అంతర్గత యుద్ధం నడుస్తోందా..? అక్కడి నాయకులు ఒకరికొకరు తలలు పట్టుకుంటున్నారా..? ఇవన్నీ ట్రంప్ ఊహలే అంటుంది ఇరాన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది.

Post Published By: dialnews
Updated : 25 April 2026, 5:47 PM IST

ఇరాన్‌లో అంతర్గత యుద్ధం నడుస్తోందా..? అక్కడి నాయకులు ఒకరికొకరు తలలు పట్టుకుంటున్నారా..? ఇవన్నీ ట్రంప్ ఊహలే అంటుంది ఇరాన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. 'మాలో విభేదాలు లేవు.. మాది ఉక్కు సంకల్పం' అంటూ టెహ్రాన్ నుంచి ఒకే గొంతు వినిపిస్తోంది. అసలు ట్రంప్ ఏమన్నారు..? ఘాలిబాఫ్ ఎందుకు అంత ఘాటుగా సమాధానం ఇచ్చారు..? .ఏప్రిల్ 23న డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ నాయకత్వం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, అక్కడి 'హార్డ్ లైనర్లు', 'మోడరేట్లు' కుక్కలు, పిల్లుల్లా పోరాడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యుద్ధ రంగంలో ఓటమిని చవిచూస్తున్న హార్డ్ లైనర్లు అధికారం కోసం ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇరాన్ ఒక ఏకీకృత నిర్ణయానికి రాలేకపోతోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ చేసిన ఈ 'డివిజన్' ఆరోపణలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు.

ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ఇరాన్‌లో తీవ్రవాదులు లేరు, మితవాదులు లేరు.. మనమందరం ఇరానియన్లం మరియు విప్లవకారులం' అంటూ ఆయన స్పష్టం చేశారు. 'మేమంతా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి పూర్తి విధేయులం. ప్రజలు, ప్రభుత్వం మధ్య ఇనుప ఐక్యత ఉంది' అని ఆయన స్పష్టం చేసారు. శత్రువులు సృష్టించే ఇలాంటి పుకార్లను తాము తిప్పికొడతామని, దురాక్రమణదారులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

తమ దేశంలో కేవలం ఒకే ఒక్క నిర్ణయాధికారి ఉన్నారని, అది సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అని ఘాలిబాఫ్ నొక్కి చెప్పారు. ఇది ఇరాన్ నాయకత్వం లోపల అంతా సవ్యంగానే ఉందనే భరోసాను ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక్కడ ట్రంప్ మాత్రమే కాదు. మీడియా కూడా ఇరాన్ తో మైండ్ గేమ్ ఆడింది. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో చీలికలు వచ్చాయని, గాలిబాఫ్ తన చర్చల బాధ్యతల నుంచి తప్పుకున్నారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అయితే, దీనిని ఇరాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది.

"మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, శత్రువుల తప్పుడు ప్రచారం మా ఐక్యతను దెబ్బతీయలేదు" అని గాలిబాఫ్ మరియు అధ్యక్షుడు పెజెష్కియన్ సంయుక్త ప్రకటన చేశారు. ఘాలిబాఫ్ కేవలం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడలేదు. "మేము గత రెండు వారాలుగా యుద్ధరంగంలో కొత్త అస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధమయ్యాం" అని కూడా హెచ్చరించారు. చర్చల ముసుగులో అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం వల్ల ఇరాన్ చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

దీనికి "అమెరికా తన గూండాయిజంతో మమ్మల్ని లొంగదీసుకోలేదు" అని ఘాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. కేవలం ఘాలిబాఫ్ మాత్రమే కాదు.. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 'బాటిల్ ఫీల్డ్ మరియు డిప్లొమసీ మాకు రెండు కళ్ల లాంటివి.. మాలో విభేదాలు సృష్టించడం శత్రువుల వల్ల కాదు' అని వారు తేల్చి చెప్పారు. హార్డ్ లైనర్లు మరియు మోడరేట్లు అనే విభజన కేవలం పాశ్చాత్య దేశాల మైండ్ గేమ్ మాత్రమేనని ఇరాన్ వాదిస్తోంది.

ఈ ఒక్క విషయంలోనే కాదు. పలు విషయాల్లో.. పవర్ ఫుల్ కౌంటర్స్ ఘాలిభాఫ్ ఇచ్చారు. ట్రంప్ "మేము హోర్ముజ్ జలసంధిని పూర్తిగా సీల్ చేసాం" అని ప్రకటిస్తే, దానికి ప్రతిగా ఇరాన్ ఒక కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. "ఇరాన్ అనుమతి లేకుండా, మేము సూచించిన రూట్ లో కాకుండా ఏ నౌక కూడా జలసంధి దాటడానికి వీల్లేదు" అని గాలిబాఫ్ హెచ్చరించారు. అంటే, ఇప్పుడు హోర్ముజ్ లో ఎవరు బాస్ అనే దానిపై ఒక పెద్ద సైకోలాజికల్ యుద్ధం నడుస్తోంది.

మొన్న ట్రంప్.. తనకు అనుకూలంగా మాట్లాడుకున్న మాటలకు కూడా.. ఇదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ కేవలం ఒక గంటలో "ఏడు అబద్ధాలు" ఆడాడని ఎద్దేవా చేశారు. చర్చల పురోగతి గురించి ట్రంప్ చేస్తున్న ట్వీట్లు అన్నీ కేవలం ఆయిల్ మార్కెట్లను మరియు పబ్లిక్ ఒపీనియన్ ని ప్రభావితం చేయడానికి వేస్తున్న ఎత్తుగడలని ఆయన తేల్చేసారు. అమెరికా ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ ప్రకారం.. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం వల్ల ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది.

ఈ ఆర్థిక ఒత్తిడి వల్లే ఇరాన్ నాయకత్వంలో కలహాలు మొదలయ్యాయని అమెరికా నమ్ముతోంది. కానీ గాలిబాఫ్ మాత్రం, "మేము యుద్ధ రంగంలో అమెరికా కంటే బలహీనంగా ఉండొచ్చు కానీ, నిశ్చయంతో వారిని ఓడించగలం" అని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు చర్చలు, మరోవైపు ఆంక్షలు.. ఈ నేపథ్యంలో ట్రంప్ మరియు ఘాలిబాఫ్ మధ్య సాగుతున్న ఈ వాగ్వివాదం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్ నిజంగానే ఐక్యంగా ఉందా లేక ఒత్తిడిలో ఇలా మాట్లాడుతోందా అనేది కాలమే నిర్ణయించాలి.

Published : 
  • 25 April 2026, 5:47 PM IST