ప్రపంచ పటంలో పశ్చిమ దేశాలు ఎన్ని కుట్రలు చేసినా.. తన వ్యూహాత్మక పట్టుతో అగ్రరాజ్యం అమెరికాకే ముచ్చెమటలు పట్టిస్తోంది ఇరాన్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ను విజయవంతంగా దిగ్బంధించి, ప్రపంచ చమురు రవాణాను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఇరాన్.. ఇప్పుడు మరో సంచలన వ్యూహానికి తెరలేపింది. అమెరికా, దాని మిత్రదేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా.. ఇప్పుడు 'బాబ్-ఎల్-మందేబ్' జలసంధి వైపు ఇరాన్ అడుగులు వేస్తోంది. ఒకవేళ ఇరాన్ అనుకున్నదే జరిగితే, ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యం ఇరాన్ పాదాల చెంతకు చేరక తప్పదు. అసలు ఏంటా వ్యూహం? ఇరాన్ ఎలా ప్రపంచాన్ని శాసించబోతోంది?
అగ్రరాజ్యం పెంటగాన్ ఇరాన్ తీరప్రాంతాలపై ఎన్ని దాడులు చేసినా.. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సరే కదా, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ లాంటి ప్రాంతాలలో ఉన్న అమెరికా అనుకూల స్థావరాలపై ఎదురుదాడి చేసి తన సత్తా ఏంటో నిరూపించింది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను బ్లాక్ చేయడం ద్వారా అమెరికాను ఇరాన్ దాదాపు మోకాళ్లపై నిలబెట్టింది. ఇప్పుడు అదే దూకుడుతో, ఇరాన్ ఆర్మీ.. ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికాకు, దాని మిత్రదేశాలకు లాభం చేకూర్చే అన్ని ప్రాంతీయ ఇంధన ఎగుమతి మార్గాలను మూసివేస్తామని ప్రకటించింది.
ఇది కేవలం హెచ్చరిక కాదు, ప్రపంచ భౌగోళిక రాజకీయాలను మార్చేసే మహా వ్యూహం. హోర్ముజ్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలసంధి 'బాబ్-ఎల్-మందేబ్'. ప్రపంచ దేశాల ముడి చమురు వ్యాపారంలో దాదాపు 10 నుండి 12 శాతం వాణిజ్యం ఇక్కడి నుంచే జరుగుతుంది. భౌగోళికంగా ఈ ప్రాంతం ఇరాన్ సరిహద్దుల్లో లేకపోయినా.. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న బలమైన హౌతీ యోధులు ఉన్నారు. అమెరికా పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతీ రెబెల్స్, ఇరాన్ అండతో ఈ మార్గంలో వెళ్లే శతృదేశాల వాణిజ్య నౌకలను, ఆయిల్ ట్యాంకర్లను నిలువరించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు.
కేవలం డ్రోన్లు, క్షిపణులతోనే అమెరికా నౌకాదళాన్ని హడలెత్తించే సత్తా ఇరాన్ వ్యూహాలకు ఉంది. ఇరాన్ గనుక బాబ్-ఎల్-మందేబ్‌ను ప్రభావితం చేస్తే, ఈజిప్టులో ఉన్న అంతర్జాతీయ సూయజ్ కెనాల్ కూడా పూర్తిగా స్తంభించిపోతుంది. యూరప్, ఆసియాలను కలిపే ఈ అతిపెద్ద షార్ట్‌కట్ మార్గం మూతపడితే.. శతృదేశాల నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వారికి కనీసం 10 నుండి 15 రోజుల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, బిలియన్ల కొద్దీ డాలర్ల అదనపు ఖర్చు అవుతుంది. అంతేకాదు, ఇరాన్ తన సొంత తీరప్రాంతమైన గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మైన్లు వేయడం ద్వారా, యాంటీ-షిప్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా శతృవుల నౌకలను సముద్రంలోనే సమాధి చేయగలదు.
సౌదీ అరేబియాకు చెందిన యాన్బు, యూఏఈకి చెందిన ఫుజైరా ఎగుమతి టెర్మినల్స్ కూడా ఇరాన్ క్షిపణుల పరిధిలోనే ఉన్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను, బెదిరింపులను ఎదుర్కొంటూ కూడా ఇరాన్ ఇంతటి ధైర్య సాహసాలను ప్రదర్శించడం సాధారణ విషయం కాదు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్, బాబ్-ఎల్-మందేబ్, ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్, గల్ఫ్ ఆఫ్ ఒమన్.. ఇలా ప్రపంచ వ్యాపారానికి గుండెకాయ లాంటి అన్ని మార్గాలపై ఇరాన్ పూర్తి నియంత్రణ సాధించే దిశగా వెళ్తోంది. సూపర్ పవర్స్ అని ముద్ర వేసుకున్న దేశాలు కూడా ఇరాన్ వ్యూహాల ముందు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.