Top story: మూడు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడి ఇరాన్ సంచలన ప్రతికారం!

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న పగ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణకిస్తోంది.

Post Published By: dialnews
Updated : 8 September 2026, 1:55 PM IST

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న పగ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణకిస్తోంది. ఇటీవలే ఇరాన్‌కు చెందిన మూడు భారీ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా సైన్యం క్షిపణులతో దాడులు చేసి ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి వెలుపల ఒక 'ఎక్స్‌క్లూజన్ జోన్' అంటే నిషేధిత ప్రాంతం ప్రకటించబోతున్నట్లు హెచ్చరించింది.. అసలు అమెరికా ఆ ట్యాంకర్లపై ఎందుకు దాడి చేసింది? ఇరాన్ ప్రకటించిన నిషేధిత ప్రాంతం వల్ల ప్రపంచానికి ఎలాంటి ముప్పు రాబోతోంది? దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయా?

కథలోకి వెళ్తే.. కొద్దిరోజుల క్రితం అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడికి తీవ్రంగా స్పందించిన అమెరికా సైన్యం, ఇరాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని భావించింది. అందులో భాగంగానే ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లను మిలిటరీ దాడుల ద్వారా అడ్డుకుని ధ్వంసం చేసింది. నిజానికి ఈ రెండు దేశాల మధ్య గత కొద్దికాలంగా చర్చలు విఫలమవడంతో అమెరికా.. ఇరాన్ ఓడరేవులపై కఠినమైన నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ తన చమురును ఇతర దేశాలకు అమ్ముకోకుండా ఆర్థికంగా దెబ్బతీయడమే అమెరికా వ్యూహం. ఈ అమెరికా నావికా దళానికి చెందిన దాదాపు 20 కి పైగా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఇప్పటికే 90 కి పైగా వాణిజ్య ఓడల దారి మళ్లించాయి.

అమెరికా చేస్తున్న ఈ దిగ్బంధనానికి ఇరాన్ కొత్త జాతీయ భద్రతా అధిపతి మొహసేన్ రెజాయ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో తాము హార్ముజ్ జలసంధి చుట్టూ ఒక ప్రత్యేక నిషేధిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ జోన్ అమెరికా నావికా దళం దిగ్బంధనం చేసిన లైన్ నుండి మొదలై పర్షియన్ గల్ఫ్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించి హార్ముజ్ జలసంధి గుండా వెళ్లాలని చూసే ఏ ఓడనైనా సరే తాము గుర్తించి, వారిపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాదు, అమెరికాకు చెందిన ఒక డ్రోన్ నౌకను తాము విజయవంతంగా కూల్చేశామని కూడా ఇరాన్ ప్రకటించింది, అయితే అమెరికా దీనిని అబద్ధమని కొట్టిపారేసింది.

ఈ హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సింహభాగం ఈ సముద్ర మార్గం గుండానే ప్రయాణించాలి. అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ప్రకారం, ఈ ఉద్రిక్తతల మధ్య కూడా ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 90 లక్షల బ్యారెళ్ల చమురు ఈ జలసంధి గుండా వెళ్తోంది. ఒకవేళ ఇరాన్ గనుక ఈ మార్గాన్ని పూర్తిగా అడ్డుకుంటే అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడి, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అయితే తాము దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొని నిలబడ్డామని, ఇప్పుడు కూడా రోజుకు 10 నుండి 15 లక్షల బ్యారెళ్ల చమురును సులువుగా విక్రయిస్తున్నామని ఇరాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యవర్తులుగా ఉన్న ఒమన్, ఖతార్ వంటి దేశాలను కూడా తాము నమ్మడం లేదని, ఇకపై గ్యారెంటీ ఉంటేనే దౌత్యపరమైన చర్చలు జరుపుతామని ఇరాన్ తెగేసి చెప్పింది.

Published : 
  • 8 September 2026, 1:55 PM IST