Top story: పాకిస్తాన్‌ను వణికిస్తున్న హౌతీ రెబల్స్ సౌదీ, ఇరాన్ మధ్య ఇరుక్కున్న పాక్.!

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. హూతీ రెబల్స్ సౌదీపై క్షిపణి దాడులకు తెగబడ్డం ఉగ్రదేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ దాడుల ప్రకంపనలు ఇప్పుడు సౌదీ కంటే ఎక్కువగా పాక్‌నే వణికిస్తున్నాయి

Post Published By: dialnews
Updated : 18 July 2026, 12:10 PM IST

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. హూతీ రెబల్స్ సౌదీపై క్షిపణి దాడులకు తెగబడ్డం ఉగ్రదేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ దాడుల ప్రకంపనలు ఇప్పుడు సౌదీ కంటే ఎక్కువగా పాక్‌నే వణికిస్తున్నాయి. ఒకవైపు దశాబ్దాల మిత్రదేశం, ఆర్థిక రక్షకుడు అయిన సౌదీ అరేబియా.. మరోవైపు సరిహద్దు దేశం, బలీయమైన సైనిక శక్తి కలిగిన ఇరాన్! ఈ ఇద్దరి ఘర్షణ మధ్య ఏం చేయాలో, ఎవరి పక్షాన నిలవాలో అర్ధంకాక తల పట్టుకుంటోంది. పైగా సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఇస్లామాబాద్‌ను మరింత గందరగోళంలోకి నెట్టేసింది. ఇంతకూ, సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పాక్ పాలిట శాపంగా ఎందుకు మారాయి? సౌదీ, ఇరాన్ ఘర్షణలు ముదిరితే పాక్ పతనం కూడా చేరువ కావడం ఖాయమా? పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం ఇస్లామాబాద్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

యెమెన్ నుంచి హూతీ గ్రూప్ సౌదీపై ప్రయోగించిన క్షిపణులు.. కేవలం రియాద్‌ను మాత్రమే టార్గెట్ చేయలేదు, పాకిస్తాన్ దౌత్య వ్యూహాలనూ ఛిన్నాభిన్నం చేశాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తాజా పరిణామాలు పాకిస్తాన్ పాలకుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే, ఈ వివాదం ఎక్కడ తమను కూడా ఈ యుద్ధంలోకి లాగుతుందోనని ఇస్లామాబాద్ భయపడుతోంది. పాక్ భయానికి బలమైన కారణం ఉంది. గత ఏడాది సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక చారిత్రాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం, ప్రస్తుతం వేలాది మంది పాకిస్తానీ సైనికులు సౌదీ గడ్డపై, ముఖ్యంగా సౌదీ-యెమెన్ సరిహద్దులకు సమీపంలో ఉన్నారు. ఇప్పుడు హూతీలు వేట తీవ్రంచేస్తే, ముందుగా బలయ్యేది అక్కడ కాపలా ఉన్న పాక్ సైనికులే.

. పాకిస్తాన్ తన అంతర్గత వర్గాల ద్వారా ఇరాన్‌కు అత్యున్నత స్థాయిలో ఒక కఠినమైన సందేశాన్ని పంపింది. "సౌదీ అరేబియాపై జరిగే దాడులను పాకిస్తాన్‌పై జరిగిన దాడులుగానే భావిస్తాం.. ఇది మా రెడ్ లైన్" అని ఒక పాక్ అధికారి స్పష్టం చేశాడు. మిత్రదేశం కోసం ప్రాణాలైనా ఇస్తామని పైకి చెబుతున్నా.. ఇరాన్‌తో నేరుగా ఢీకొట్టడం పాకిస్తాన్‌కు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే పాక్ దౌత్యం డోలాయమానంలో పడింది. ఈ సంక్షోభం కేవలం సైనికపరమైనదే కాదు.. ఆర్థికంగా పాక్ పీక నొక్కేసే ముప్పు కూడా ఇందులో ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా పాకిస్తాన్‌కు వచ్చే ఇంధన సరఫరాలకు ఎర్ర సముద్రం అత్యంత కీలకమైన జలమార్గం. ఈ యుద్ధం గనుక విస్తరిస్తే, రెడ్ సీలో షిప్పింగ్ నిలిచిపోతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు చమురు సరఫరా ఆగిపోతే ఆ దేశం పూర్తిగా అంధకారంలోకి వెళ్లడం ఖాయం.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్తాన్ కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమే కాదు, అది తెరవెనుక పెద్ద మధ్యవర్తి కూడా! గత నెలలోనే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదర్చడంలో ఇస్లామాబాద్ కీలక పాత్ర పోషించింది. కానీ, ఇప్పుడు ఇరాన్ మద్దతున్న హూతీలు సౌదీపై దాడి చేయడంతో.. అమెరికా-ఇరాన్ మధ్య పాక్ చేస్తున్న మధ్యవర్తిత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. అయినప్పటికీ, పాక్ ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. తీవ్ర నిరాశ, అసహనం ఉన్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ కోసం తాము ఎంతో శ్రమించామని, దీనిని ఎలాగైనా బతికించుకోవడమే తమ ప్రయోజనమని ఒక పాకిస్తాన్ రక్షణాధికారి అంగీకరించాడు. అమెరికాను ప్రసన్నం చేసుకోవాలన్నా, ఇరాన్‌తో సరిహద్దు ఘర్షణ రాకుండా ఉండాలన్నా ఈ మధ్యవర్తిత్వం పాకిస్తాన్‌కు ఒక కవచం లాంటిది.

ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ అధికారికంగా చాలా లౌక్యమైన ప్రకటనలు చేస్తోంది. విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంధ్రాబీ మాట్లాడుతూ.. "అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. నిరంతర చర్చలు, దౌత్యం తప్ప ఈ సమస్యకు మరో ప్రత్యామ్నాయం లేదని సూచించారు. అంటే, తాము నేరుగా యుద్ధంలోకి దిగడానికి సిద్ధంగా లేమనే సంకేతాన్ని ఇస్లామాబాద్ ఇస్తోంది. కానీ, లౌక్యం ఎల్లకాలం పని చేయదు. యుద్ధం గనుక తీవ్రరూపం దాలిస్తే పాకిస్తాన్ యుద్ధంలోకి దిగక తప్పదు. "యుద్ధం ముగియడం అందరికీ మంచిది. కానీ సౌదీ గనుక మమ్మల్ని సాయం కోరితే, మేము వారి పక్షాన నిలబడతాం, అందులో ఎలాంటి సందేహం లేదని పాక్ రక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అది చెస్సినంత ఈజీ కాదు. మొత్తంగా.. సౌదీ ఇచ్చే డాలర్ల కోసం ఇరాన్‌తో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవాలా? లేక ఇరాన్ కోసం సౌదీ రక్షణ ఒప్పందాన్ని తుంగలో తొక్కాలా? ఈ రెండింటిలో ఏ దిశగా అడుగులేసినా పాక్ పతనం ఖాయం.

 

Published : 
  • 18 July 2026, 12:10 PM IST