Top story: బండి సంజయ్‌కు ప్రమోషన్‌ ? పురంధేశ్వరికి కీలక బాధ్యతలు.!

కేంద్ర మంత్రి పునర్ వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు అగ్రపీఠం దక్కనుందా ? కేంద్ర మంత్రులుగా ఉన్న వారు ప్రమోషన్‌ రేసులో ఉన్నారా ? ఏపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి సేవలను...కేంద్ర ప్రభుత్వంలో వినియోగించుకుంటారా ?

Post Published By: dialnews
Updated : 4 July 2026, 2:56 PM IST

కేంద్ర మంత్రి పునర్ వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు అగ్రపీఠం దక్కనుందా ? కేంద్ర మంత్రులుగా ఉన్న వారు ప్రమోషన్‌ రేసులో ఉన్నారా ? ఏపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి సేవలను...కేంద్ర ప్రభుత్వంలో వినియోగించుకుంటారా ? లేదంటే పార్టీ కోసం వాడుకుంటారా ? కొత్తగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి ఛాన్స్‌ దక్కనుంది ? ఇప్పుడిదే హాట్‌ టాపిక్..త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే మంత్రివర్గంలో మార్పులు ఉండనున్నాయి. గత నెలలో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో సమావేశం కావడంతో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అవి మర్యాదపూర్వక భేటీలు అని చెబుతున్నప్పటికీ మంత్రివర్గ మార్పులపై చర్చ జరిగినట్లు భావిస్తున్నారు.

సాధారణంగా ఈ నెల మూడోవారంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. దీంతో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ కూడా అంతలోపే జరిగే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో కొత్త టీమ్‌ను ప్రకటించే సమయంలోనే కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులు ఉండనున్నాయి. యువ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించటం...పార్టీ బాధ్యతలు చూస్తున్న కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గం నుంచి తప్పుకోనున్న కొందరిని గవర్నర్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ- మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే విధంగా కసరత్తు కొనసాగుతోంది. కొందరు మంత్రులకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ, జాతీయ కౌన్సిల్ లోనూ కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. కీలక పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించటం ఖాయంగా కనిపిస్తోంది.

బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ప్రమోషన్‌ దక్కనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు ఏపీ నుంచి పురంధ్వేశ్వరికి కొత్తగా జాతీయ కార్య వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరి యూపీఏ హయాంలో హెచ్‌ఆర్‌డీ, వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఈ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌ పదవి వస్తుందని ఆశించినప్పటికీ...పురంధేశ్వరికి ఆ పదవి దక్కలేదు. ఇప్పుడు ఆమె సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని పురంధేశ్వరికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
గతవారం కొందరు కేంద్ర సహాయమంత్రులతో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ చర్చలు జరిపారు. నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్‌ సంతోష్‌... మూడు గంటల పాటు సమావేశం కావడం ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

ఈ ముగ్గురు నేతల మధ్య జరిగిన చర్చల్లో కొత్త కేంద్ర బృందం రూపకల్పనతో పాటు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్న కొందరు నేతలను సంస్థాగత బాధ్యతల కోసం తిరిగి పార్టీలోకి తీసుకోనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు కేంద్రమంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాకు ఉత్తర్​ప్రదేశ్, దిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కర్ణాటక నుంచి విజయేంద్ర, తమిళ నాడు నుంచి మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ లకు జాతీయ టీంలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రాలకు మోదీ కేబినెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్, శివసేన-యూబీటీ రెబల్ ఎంపీలకు కూడా స్థానం కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త కార్యవర్గం పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Published : 
  • 4 July 2026, 2:56 PM IST