Top story: సిఐ నాగరాజును కాపాడుతున్నారా..? అరెస్ట్ ను ఆపుతున్నారా..? నాగరాజుకు సింగం రేంజ్ ఇమేజ్…!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో, పోలీస్ శాఖలో ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే.. విజయవాడ కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

Post Published By: dialnews
Updated : 22 June 2026, 1:51 PM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో, పోలీస్ శాఖలో ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే.. విజయవాడ కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఒక రౌడీషీటర్ మిస్సింగ్ వెనుక ఏం జరిగింది..? సీఐ నాగరాజుపై కూటమి ప్రభుత్వం ఎందుకు అంత కఠినంగా వ్యవహరించింది..? కానీ, ట్విస్ట్ ఏంటంటే.. హత్య కేసు నమోదైనా, అరెస్ట్ కావాల్సిన ఒక పోలీస్ అధికారికి విజయవాడ స్థానిక ప్రజలు, కాలనీవాసులు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు..? "సీఐ నాగరాజు మాకు కావాలి.. ఆయన వల్లే కృష్ణలంక ప్రశాంతంగా ఉంది" అంటూ రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు..? ఈ కేసులో కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందా.. లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందా..? అసలు అరెస్ట్ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది..? ఈ వీడియోలో చూద్దాం.

ముందుగా ఈ వివాదానికి మూలకారణం ఏంటో చూద్దాం. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అనే స్థానిక హిస్టరీ షీటర్, మే నెలలో అదృశ్యమయ్యాడు. మే 9వ తేదీన అతడిని కృష్ణలంక పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారని, ఆ తర్వాతే అతను కనిపించకుండా పోయాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు.. ఇదొక లాకప్ డెత్ అనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకువచ్చి ప్రశ్నించారని, ఆ సమయంలోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్ల అతను మరణించాడనే ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణలంకలోని స్వర్గపురి స్మశానవాటికలో దహనం చేశారనే సంచలన నిజాలు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. ఒక కోటి రూపాయల భూమి వివాదం సెటిల్‌మెంట్ వ్యవహారమే దీని వెనుక ఉందనే కోణం కూడా వినిపిస్తోంది.

ఇక్కడ ప్రజల్లో ఒక సందేహం ఉంది. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం సీఐ నాగరాజుకు ఏమైనా సపోర్ట్ చేస్తోందా..? అని. కానీ, గ్రౌండ్ రియాలిటీ చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, ఈ కేసు తీవ్రతను బట్టి సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా, పారదర్శకంగా విచారణ జరగాలని కేసును సీనియర్ ఐపీఎస్ అధికారికి, ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద 'హత్య కేసు' నమోదు చేశారు. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, తప్పు చేసిన వారు పోలీసులైనా సరే వదిలే ప్రసక్తే లేదని హోంశాఖ గట్టి సంకేతాలు పంపింది. కాబట్టి ప్రభుత్వం అతనికి అండగా నిలబడింది అనడం కంటే, చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసిందని చెప్పడమే కరెక్ట్.

మరి ఒకవేళ నాగరాజుపై హత్య కేసు నమోదైతే, విజయవాడ ప్రజలు అతనికి ఎందుకు అండగా నిలబడుతున్నారు..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఒకప్పుడు గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ గ్యాంగ్‌లు, రౌడీషీటర్ల ఆగడాలు ఎక్కువగా ఉండేవని స్థానికులు చెబుతున్నారు. సీఐ నాగరాజు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, అప్పటి నుంచి రౌడీల ఆట కట్టించారని, గంజాయి ముఠాలను ఏరిపారేశారని మహిళలు, స్థానిక కాలనీ వాసులు బాహాటంగానే సపోర్ట్ చేస్తున్నారు. "ఆయన వల్లే ఈరోజు కృష్ణలంక ప్రశాంతంగా ఉంది, రౌడీని అంతం చేస్తే పోలీస్‌పై హత్య కేసు పెడతారా?" అంటూ స్థానికులు ఆందోళనలు చేపట్టారు.

కొందరు జనసేన స్థానిక నాయకులు, కాలనీ వాసులు ఏకంగా సీఐ నాగరాజు ఇంటి ముందు ‘సేవ్ సీఐ నాగరాజు’ అంటూ నిరసనలు ప్రదర్శించడం విశేషం. ప్రజల్లో ఆయనకున్న ఈ "సింగం" లాంటి ఇమేజ్ వల్లే, ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ నుంచి అతనికి విపరీతమైన పాజిటివ్ సెంటిమెంట్ వ్యక్తమవుతోంది. అయితే, ప్రజల్లో ఇంత సానుకూలత ఉండడం, తెరవెనుక కొంతమంది రాజకీయ పెద్దల హస్తం ఉందనే ఆరోపణల వల్లే సీఐ నాగరాజు అరెస్ట్ ఆలస్యమవుతోందా? అనే అనుమానాలు ఉన్నాయి. కానీ పోలీసు వర్గాల ప్రకారం.. ఈ జాప్యానికి కారణం రాజకీయ ఒత్తిళ్లు కావు, పక్కా ఆధారాలు సేకరించడమే. ఇదొక సాధారణ నేరం కాదు, కస్టడీ మరణం మరియు శవాన్ని మాయం చేసిన కేసు. కాబట్టి ఎలాంటి లూప్‌హోల్స్ లేకుండా పక్కాగా ఆధారాలు కోర్టుకు సమర్పించాలి.

అందుకే విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం స్టేషన్ రికార్డులను, స్మశానవాటిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని, స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఇతర సిబ్బందిని గంటల తరబడి ప్రశ్నించారు. ఈ చట్టపరమైన విచారణ ప్రక్రియ, క్షేత్రస్థాయి ఆధారాల సేకరణ వల్లే అరెస్ట్ ప్రక్రియకు కాస్త సమయం పడుతోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. సీఐ నాగరాజు నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధారాలన్నీ పక్కాగా లభించడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. శాంతిభద్రతలను కాపాడడంలో సీఐ నాగరాజు మంచి ఆఫీసరే కావచ్చు, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ఉపయోగించి, కస్టడీ మరణానికి కారణమవడం ఎంతవరకు సమంజసం? రౌడీయిజం అణచడానికి పోలీసులు చట్ట పరిధి దాటవచ్చా? అనేవి ప్రధాన ప్రశ్నలు.

Published : 
  • 22 June 2026, 1:51 PM IST