Top story: రాఘవ్ చడ్డాకు కేంద్ర కేబినెట్ పదవి..? కేంద్ర కేబినేట్ టూ పంజాబ్ సీఎం పంజాబ్‌పై అమిత్ షా గురి.. కేజ్రీవాల్‌కు బిగ్ షాక్…!

భారత రాజకీయాల్లో ఎప్పుడు, ఏ ట్విస్ట్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. దిల్లీ, పంజాబ్‌లలో అధికారమే పరమావధిగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ పునాదులను కదిలిస్తూ.. 2026 ఏప్రిల్ నెలలో ఒక పెను రాజకీయ భూకంపం సంభవించింది.

Post Published By: dialnews
Updated : 22 May 2026, 10:07 AM IST

భారత రాజకీయాల్లో ఎప్పుడు, ఏ ట్విస్ట్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. దిల్లీ, పంజాబ్‌లలో అధికారమే పరమావధిగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ పునాదులను కదిలిస్తూ.. 2026 ఏప్రిల్ నెలలో ఒక పెను రాజకీయ భూకంపం సంభవించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత ఆప్తుడు, ఆప్ యువ కిరణం రాఘవ్ చడ్డా ఊహించని విధంగా కాషాయ జెండా కప్పుకున్నారు. కేవలం ఆయనొక్కరే కాదు, ఏకంగా ఆప్‌కు చెందిన 7 గురు రాజ్యసభ ఎంపీలను తన వెంట పెట్టుకుని బీజేపీలో విలీనం చేసేశారు.

అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘనకార్యం చేసినందుకు గానూ రాఘవ్ చడ్డాకు మోడీ 3.0 కేబినెట్‌లో కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందనే ఊహాగానాలు దిల్లీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కా వ్యూహం ఉందట. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ అమిత్ షా వేసిన ఆ స్కెచ్ ఏంటి? రాఘవ్ చడ్డా కేంద్ర మంత్రి అయితే పంజాబ్ రాజకీయం ఎలా మారబోతోంది?

గత కొన్నాళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానానికి, రాఘవ్ చడ్డాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుండి ఆయన్ను తొలగించినప్పటి నుండి ఈ గ్యాప్ మరింత పెరిగింది. కట్ చేస్తే.. 2026 ఏప్రిల్ 24న రాఘవ్ చడ్డా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆప్ తన ఆశయాల నుండి తప్పుకుందని, దేశ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే ప్రాకులాడుతోందని ఆరోపిస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యాంగంలోని ఎస్కేప్ రూట్‌ను వాడుకుంటూ.. రాజ్యసభలో ఆప్‌కు ఉన్న 10 మంది ఎంపీల్లో ఏకంగా 2/3 వంతు మందిని, అంటే తనతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్ లాంటి 7 గురు కీలక నేతలను లీగల్‌గా బీజేపీలో విలీనం చేసేశారు.

దీనివల్ల అటు యాంటీ డిఫెక్షన్ లా ముప్పు తప్పించుకోవడమే కాకుండా, రాజ్యసభలో బీజేపీ బలాన్ని 113 స్థానాలకు పెంచి ఎన్డీయేను మరింత బలోపేతం చేశారు. ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు గానూ, రాఘవ్ చడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని పెద్ద పీట వేయాలని మోడీ-షా ద్వయం భావిస్తోందట. అయితే రాఘవ్ చడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం వెనుక కేవలం రాజ్యసభ సీట్ల కృతజ్ఞత మాత్రమే లేదు, దాని వెనుక హోంమంత్రి అమిత్ షా వేసిన ఒక మెగా పొలిటికల్ స్కెచ్ ఉంది.

2026 మార్చి 14న పంజాబ్‌లోని మోగాలో జరిగిన ‘బద్లావ్ ర్యాలీ’కి అమిత్ షా హాజరైనప్పుడే ఈ ఆపరేషన్‌కు పునాది పడిందని దిల్లీ ఇన్‌సైడ్ టాక్. పంజాబ్‌లో అడుగుపెట్టడానికి బీజేపీ చాలా కాలంగా సరైన సమయం కోసం చూస్తోంది. అక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే బలమైన సిక్కు నేతలు, అలాగే క్లీన్ ఇమేజ్ ఉన్న యువ ముఖాలు కావాలి. గత 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలతో బంపర్ మెజారిటీ సాధించడంలో ఈ రాఘవ్ చడ్డాదే కీలక పాత్ర.

పంజాబ్ ఎన్నికల కో-ఇన్‌చార్జ్‌గా ఉండి వ్యూహాలు రచించిన చడ్డాకు అక్కడి ప్రతి నియోజకవర్గంపై, ఆప్ అంతర్గత లూప్‌హోల్స్‌పై పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు అదే చాణక్యుడిని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఆప్ కోటను బద్దలు కొట్టవచ్చని అమిత్ షా ప్లాన్ చేశారు. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి రాఘవ్ చడ్డాను కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోట్ చేయడం ద్వారా పంజాబ్ ప్రజల్లోకి ఒక బలమైన సంకేతాన్ని పంపాలని బీజేపీ భావిస్తోంది. గతంలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వచ్చినప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి మధ్యప్రదేశ్‌లో పార్టీని ఎలా నిలబెట్టారో.. ఇప్పుడు రాఘవ్ చడ్డా విషయంలోనూ అదే ఫార్ములాను అమిత్ షా అప్లై చేయబోతున్నారు.

కేంద్ర మంత్రి హోదాలో రాఘవ్ చడ్డా పంజాబ్ అంతటా పర్యటిస్తూ.. ఆప్ వైఫల్యాలను, భగవంత్ మాన్ ప్రభుత్వ లోపాలను ఎండగడితే క్యాడర్‌లో జోష్ వస్తుందని అధిష్టానం నమ్ముతోంది. పైగా చడ్డాకు ఉన్న యూత్ ఫాలోయింగ్, కార్పొరేట్ లుక్ మరియు క్లీన్ ఇమేజ్ పంజాబ్‌లోని విద్యావంతులైన ఓటర్లను ఆకర్షించడానికి బాగా పనికొస్తాయి. ఆప్ నుంచి వచ్చిన హర్భజన్ సింగ్ లాంటి స్టార్స్ కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉండటం కలిసొచ్చే అంశం. రాఘవ్ చడ్డా దెబ్బకు అరవింద్ కేజ్రీవాల్ కంగుతిన్నారు.

7 గురు ఎంపీలు ఒకేసారి బోర్డు తిప్పేయడంతో రాజ్యసభలో ఆప్ బలం కేవలం 3 స్థానాలకు పడిపోయింది. సంజయ్ సింగ్ లాంటి నేతలు వీరిపై కోర్టులకు వెళ్తామని, అనర్హత వేటు వేయిస్తామని ఎంత మొత్తుకుంటున్నా.. రాజ్యాంగబద్ధంగా 2/3 వంతు మెజారిటీతో విలీనం జరగడంతో ఆప్ ఆటలు సాగడం లేదు. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం ఈ లోపు రాఘవ్ చడ్డా అనుచరులపై పొలిటికల్ వెండెట్టా అంటే రాజకీయ కక్షసాధింపు చర్యలుకు దిగుతోందని చడ్డా ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు కూడా చేశారు.

అంటే రాఘవ్ చడ్డాకు, ఆప్ ప్రభుత్వానికి మధ్య వార్ ఏ రేంజ్‌లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గనుక జరిగితే, రాఘవ్ చడ్డాకు దక్కే మంత్రి పదవి పంజాబ్ పాలిటిక్స్‌ను మలుపు తిప్పడం ఖాయం. చూశారుగా.. అమిత్ షా పంజాబ్ స్కెచ్ ఎంత పక్కాగా ఉందో. ఆప్ కోటలో వారినే దెబ్బకొట్టేలా రాఘవ్ చడ్డాను అస్త్రంగా వాడుకుంటూ, దిల్లీ కేబినెట్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు.

Published : 
  • 22 May 2026, 10:07 AM IST