ప్రస్తుతం భారతదేశంలో ఎన్నడూ లేనంతటి అత్యంత భీకరమైన.. ఒక ఊహించని యూత్ మూవ్‌మెంట్ నడుస్తోంది. అదే.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో సాగుతున్న విద్యార్థి ఉద్యమం. నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మొదలైన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఒక దావానలంలా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కేవలం ఒక చిన్న వ్యంగ్య ప్రచారంగా, మీమ్స్ రూపంలో ప్రారంభమైన ఈ డిజిటల్ మూవ్‌మెంట్.. కేవలం కొన్ని రోజుల్లోనే లక్షలాది మంది యువతను, విద్యార్థులను రోడ్లపైకి తెస్తుందని కేంద్ర ప్రభుత్వం కలగూడా ఊహించలేదు. ఒకటి రెండు రోజులు గొడవలు జరిగి ఆగిపోతాయని, ఆ తర్వాత అంతా మామూలైపోతుందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఇప్పుడు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే.. ఢిల్లీలోని జంతర్ మంతర్, ఐటీఓ పరిసర ప్రాంతాలు విద్యార్థుల నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో వేలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్లపై బైఠాయించారు. నిరసనకారులు భారీ సంఖ్యలో తరలిరావడంతో, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా భద్రతా కారణాల దృష్ట్యా రాజీవ్ చౌక్, ఐటీఓ సహా ఢిల్లీలోని ఏకంగా 16 కీలక మెట్రో స్టేషన్లను అధికారులు గురువారం ఉదయం పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. ఢిల్లీ మెట్రో చరిత్రలోనే ఇలా ఒకేసారి ఇన్ని ప్రధాన స్టేషన్లు మూతపడటం చాలా అరుదు. ఇది ఈ ఉద్యమం యొక్క తీవ్రతకు నిదర్శనం.
అసలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తప్పులో కాలేసింది? సాధారణంగా దేశంలో రాజకీయ పార్టీలు లేదా కార్మిక సంఘాలు పిలుపునిచ్చే బంద్‌లు, ధర్ణాల గురించి ప్రభుత్వానికి ముందే ఒక అంచనా ఉంటుంది. కానీ, ఈ ‘కాక్రోచ్’ ఉద్యమానికి ఎటువంటి సాంప్రదాయ రాజకీయ పునాది లేదు. ఇది పూర్తిగా సోషల్ మీడియా వేదికగా, టెక్నాలజీ సాయంతో యువత స్వచ్ఛందంగా నిర్మించుకున్న ఒక విప్లవం! అందుకే, ప్రభుత్వం మొదట్లో దీనిని చాలా తేలికగా తీసుకుంది. కేవలం విద్యార్థుల ఆవేశం మాత్రమే అనుకుంది. కానీ, పరీక్షల లీకేజీలతో తమ భవిష్యత్తు నాశనమవుతోందని రగిలిపోతున్న లక్షలాది మంది అభ్యర్థుల ఆవేదన.. ఒక అగ్నిపర్వతంలా బద్దలై దేశవ్యాప్తంగా ఎగసిపడుతోంది.
ఈ నిరసనలు కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. చూస్తుండగానే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పాట్నా, సూరత్, లక్నో, కోల్‌కతా వంటి దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ ఈ ఉద్యమం వేగంగా విస్తరించింది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులంతా ప్లకార్డులు పట్టుకుని వీధుల్లోకి వస్తున్నారు. ఎక్కడ చూసినా ‘జస్టిస్ ఫర్ స్టూడెంట్స్’ అనే నినాదాలు మార్మోగుతున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ హాష్ ట్యాగ్‌లు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ అపూర్వమైన జనాగ్రహాన్ని చూసి కేంద్ర పెద్దలు సైతం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
మరోవైపు ఈ కాక్రోచ్ ఉద్యమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటులతో పాటు, పలువురు సినీ, క్రీడా, సామాజిక రంగాల ప్రముఖులు బహిరంగంగా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలు విద్యార్థుల పక్షాన నిలబడటంతో.. ఈ మూవ్‌మెంట్‌కు మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. పరిస్థితి రోజురోజుకూ చేయిదాటిపోతుండటాన్ని గమనించిన మోదీ 3.0 ప్రభుత్వం.. హుటాహుటిన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. నిరసనకారులను శాంతింపజేసేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి.. సీజేపీ ప్రతినిధులు, విపక్ష నేతలతో చర్చల ప్రక్రియకు తెరలేపారు.
ప్రధాని మోదీ సైతం పేపర్ లీక్ కేసుల కోసం 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, దేశ యువతలో వ్యక్తమవుతున్న ఈ అపారమైన ఆగ్రహాన్ని, వారి అసంతృప్తిని ముందే పసిగట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా బలంగా సాగుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీకేజీల మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు, విద్యావ్యవస్థలో సమూల మార్పులు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగేలా కనిపించడం లేదు. మోదీ ప్రభుత్వానికి ఈ సరికొత్త ‘యూత్ పవర్’ అత్యంత పెద్ద సవాలుగా నిలిచింది. మరి ఈ ఉద్రిక్తతలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపిస్తుందో చూడాలి.