ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న విశాఖపట్నం వేదికగా జరిగిన పరిణామాలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ పర్యటన సందర్భంగా.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు చట్టం ఉందా? పోలీసులంటే వీరికి కనీస గౌరవం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో ఉండి శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసులను, ఉన్నతాధికారులను సైతం లెక్కచేయకుండా వైసీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుంటూ, ఖాకీలనే నెట్టివేస్తూ అరాచకం సృష్టించారు.పోలీసుల వార్నింగ్‌లను కనీసం పట్టించుకోకుండా, వారిపైనే తిరగబడటం నిన్నటి విశాఖ పర్యటనలో స్పష్టంగా కనిపించింది. అసలు నిన్న వైజాగ్‌లో ఏం జరిగింది? పోలీసులపై వైసీపీ నేతలు ఎందుకు అంతగా రెచ్చిపోయారు?
నిన్న జగన్ పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్ట్ మరియు ఆయన వెళ్లే రూట్లలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కొందరు నేతలను వెనక్కి తగ్గాలని సూచించారు. కానీ, అక్కడ ఉన్న వైసీపీ సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులపై ఎగబడ్డారు. విధుల్లో ఉన్న ఏసీపీ, సీఐ స్థాయి అధికారులను కూడా గౌరవించకుండా, వారు వార్నింగ్ ఇస్తున్నా నవ్వుతూ, హేళన చేస్తూ ముందుకు దూసుకువచ్చారు. "మమ్మల్నే ఆపుతారా?" అంటూ పోలీసుల కాలర్ల దాకా వెళ్లడం, బారికేడ్లను విరగ్గొట్టేలా ప్రవర్తించడం అక్కడున్న వారిని షాక్‌కు గురిచేసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణ కరువైందా అనేలా నిన్నటి సీన్ కనిపించింది.
నిజానికి వైసీపీ నేతలు పోలీసులపై ఇలా దౌర్జన్యానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా ఇంతకంటే ఘోరమైన ఘటన జరిగింది. అక్కడ విధుల్లో ఉన్న ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ అని కూడా చూడకుండా, వైసీపీ నాయకులు ఆమెను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించారు. ఆమె ఎంతగా నిలువరిస్తున్నా వినకుండా బూతులు తిడుతూ, చేతులతో తోస్తూ పక్కకు నెట్టివేశారు. ఈ ఘటనపై హోంమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందిస్తూ.. మహిళా పోలీసుపై దాష్టీకానికి ఒడిగట్టిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పోలీసుల వార్నింగ్‌లను బేఖాతరు చేస్తూ వైసీపీ శ్రేణులు రెచ్చిపోవడం వారి పాత అలవాట్లను గుర్తు చేస్తోంది. అసలు వైసీపీ నాయకులకు పోలీసులన్నా, చట్టాలన్నా ఎందుకు ఇంత బేఖాతరు? దీనికి కారణం గత ఐదేళ్ల వారి పాలనా విధానమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాటి ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు మూగప్రేక్షకుల్లా ఉండిపోవాల్సిన పరిస్థితిని తెచ్చారు.
తమకు అనుకూలంగా ఉండే కొందరు అధికారులను వాడుకుని, మిగిలిన సిన్సియర్ పోలీసులను పక్కన పెట్టారు. ఇప్పుడు అధికారం పోయి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ.. వైసీపీ శ్రేణుల్లో ఆనాటి 'అధికార మదం' ఇంకా దిగలేదని, తాము ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలోనే ఉన్నారని నిన్నటి, మొన్నటి ఘటనలు నిరూపిస్తున్నాయి. చట్టాన్ని గౌరవించడం తమ డిఎన్‌ఎ లోనే లేదన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటోంది. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా, వారిపైనే దౌర్జన్యానికి దిగడం వల్ల యావత్ పోలీస్ శాఖ యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటోంది.
ప్రాణాలకు తెగించి ఎండనక, వాననక డ్యూటీలు చేసే పోలీసులను పట్టుకుని గూండాల్లా ప్రవర్తిస్తే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఈసారి కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాలను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. గతంలో లాగా పోలీసులు సైలెంట్‌గా ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. శ్రీకాకుళం లేడీ ఎస్సై ఘటనపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై నాన్-బైలబుల్ కేసులు నమోదయ్యాయి. నిన్న విశాఖలో జరిగిన తోపులాట, పోలీసుల వార్నింగ్‌లను ధిక్కరించిన వారిపై కూడా వీడియో ఆధారాల ద్వారా ఐడెంటిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయాల్లో పర్యటనలు, నిరసనలు చేయడం ఎవరి హక్కైనా కావచ్చు.. కానీ శాంతిభద్రతలను కాపాడే పోలీసులనే టార్గెట్ చేయడం, లేడీ ఆఫీసర్స్ అని కూడా చూడకుండా తోసేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వైసీపీ నాయకులపై ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతుందో చూడాలి.