ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ మతపరమైన సమీకరణాలు బద్ధలయ్యాయి. మొన్నటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూ పొజిషన్లో ఉండి, ఇటీవలే సొంత పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి. కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. "ఆంధ్రప్రదేశ్" కాస్తా "ఆమెన్ ప్రదేశ్" లా మారిపోతోందంటూ ఆయన చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఈ ఒక్క వ్యాఖ్య రాబోయే రోజుల్లో వైసీపీపై, ముఖ్యంగా రాష్ట్రంలోని మెజారిటీ హిందూ ఓటు బ్యాంక్‌పై ఎలాంటి కోలుకోలేని దెబ్బ కొట్టబోతోంది? అసలు విజయసాయిరెడ్డి ఇంత ఓపెన్‌గా జగన్ మోహన్ రెడ్డిని, చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారు?
అసలు విజయసాయిరెడ్డి అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం.. కాకినాడ కేసులో బయటపడ్డ మత మార్పిడి కోణం. ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన ఐదు పేజీల లేఖను విజయసాయిరెడ్డి స్వయంగా ప్రస్తావించారు. నిందితుడు సాదిక్ ఖాన్.. సౌజన్యను ఇస్లాం మతంలోకి మారాలని, ఇస్లామిక్ సాహిత్యం చదవాలని తీవ్రంగా వేధించాడని, లవ్ జిహాద్ కుట్రకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు, గత ప్రభుత్వాల హయాం నుండి ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నా పాలకులు మూగప్రేక్షకుల్లా మిగిలిపోయారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ పాలనలో ఏపీ పరిస్థితులను ఉద్దేశించి "ఆమెన్ ప్రదేశ్" అనే తీవ్రమైన పదాన్ని వాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.
ఇప్పుడు అసలు పొలిటికల్ పాయింట్‌కు వద్దాం. విజయసాయిరెడ్డి సుదీర్ఘకాలం పాటు వైసీపీలో కీలక వ్యూహకర్తగా పనిచేశారు. పార్టీ అంతర్గత వీక్నెస్ లు ఆయనకు బాగా తెలుసు. గతంలో తిరుమల లడ్డూ వివాదం సమయంలోనే వైసీపీ తీవ్రమైన హిందూ వ్యతిరేక ముద్రను ఎదుర్కొంది. ఆ డ్యామేజ్ నుండి కోలుకోకముందే.. ఇప్పుడు విజయసాయిరెడ్డి "ఆమెన్ ప్రదేశ్" అంటూ మత మార్పిడుల అంశాన్ని లేవనెత్తడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే, ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న నేత నోటి నుంచే ఇలాంటి మాటలు రావడం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న తటస్థ హిందూ ఓటర్లను వైసీపీకి పూర్తిగా దూరం చేసే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
విజయసాయిరెడ్డి తన విమర్శల్లో కేవలం వైసీపీనే కాదు.. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు గుప్పించారు. మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో అనే భయంతోనే అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్.. ఇద్దరూ కాకినాడ లవ్ జిహాద్ కేసుపై నోరు మెదపడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ స్థానాలు ఉన్నా చంద్రబాబు ఏపీలో మతమార్పిడి నిరోధక చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. నేతలందరూ ఓట్ల కోసం లవ్ జిహాద్ లాంటి తీవ్రమైన సంఘటనలను తొక్కిపెడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇటు కూటమికి, అటు వైసీపీకి ఇద్దరికీ ఇరకాటంగా మారాయి.
రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరితే.. వైసీపీ తీవ్రమైన డిఫెన్స్‌లో పడక తప్పదు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు ఈ "ఆమెన్ ప్రదేశ్" కామెంట్స్ ను అస్త్రంగా మార్చుకుని వైసీపీపై ట్రోలింగ్ మొదలుపెట్టాయి. హిందూ సెంటిమెంట్లు బలంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఈ ప్రచారం సాగితే.. వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ కుప్పకూలే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతుండటంతో.. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకే ఆయన ఈ తరహా హిందూత్వ లైన్ ఎంచుకున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా, ఈ తాజా పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త మతపరమైన ధ్రువీకరణకు దారితీసేలా కనిపిస్తోంది.