కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. అసలు నూకరాజు కుటుంబం అంతలా ఎందుకు కుప్పకూలిపోయింది? ఆత్మహత్యకు ముందు ఆయన కుమార్తె సౌజన్య రాసిన ఆ లేఖలో ఏముంది? ఈ కేసులో అరెస్ట్ అయిన రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్‌ను పోలీసులు విచారిస్తుంటే.. బయటపడుతున్న నిజాలు విని ఖాకీ అధికారులే విస్తుపోతున్నారు. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మరణం వెనుక ఉన్న ఆ భయంకరమైన సైనేడ్ మిస్టరీ ఏంటి? అసలు హైదరాబాద్‌లో ఏం జరిగింది?
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న తిల్లపూడి నూకరాజు గారు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యతో కలిసి రాజమహేంద్రవరం గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం నుండి నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ సామూహిక ఆత్మహత్యకు ముందు నూకరాజు రాసిన సూసైడ్ నోట్, అలాగే కుమార్తె సౌజన్య రాసిన లేఖలు పోలీసులకు దొరికాయి. అందులో కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్ తమను తీవ్రంగా వేధించాడని, సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మరణానికి కూడా అతడే కారణమని పేర్కొన్నారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నాలుగు రాష్ట్రాలు దాక్కుంటూ తిరుగుతున్న సాదిక్ ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సాదిక్ ఖాన్‌ను కాకినాడకు తరలించి పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. లీకైన నిజాలు వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం. నూకరాజు కుమార్తె సౌజన్య భర్త అయిన జగదీశ్వర్ రెడ్డి గత జూలైలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అప్పట్లోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే పోలీసుల థర్డ్ డిగ్రీ విచారణలో సాదిక్ ఖాన్ అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.
జగదీశ్వర్ రెడ్డిని తానే పక్కా ప్లాన్‌తో హత్య చేశానని అంగీకరించాడు. దీనికోసం సాదిక్ ఖాన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళినట్లు విచారణలో తెలిసింది. హైదరాబాద్‌లోని ఒక లోకల్ వ్యాపారి దగ్గర గుట్టుచప్పుడు కాకుండా అత్యంత ప్రమాదకరమైన 'సైనేడ్' కొనుగోలు చేశాడు. ఆ సైనేడ్ పౌడర్‌ను తీసుకుని కాకినాడ వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగదీశ్వర్ రెడ్డిని పరామర్శించే నెపంతో సాదిక్ ఖాన్ అక్కడికి వెళ్లాడు. జగదీశ్వర్ రెడ్డి ఆరోగ్యంగా కోలుకోవడానికి, బలానికి ఉపయోగపడుతుందని చెబుతూ ఒక 'ప్రొటీన్ పౌడర్' డబ్బాను అతనికి ఇచ్చాడు. కానీ, ఆ ప్రొటీన్ పౌడర్‌లో సాదిక్ ఖాన్ అంతకుముందే హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన ప్రాణాంతకమైన సైనేడ్‌ను కలిపేశాడు.
అది తెలియని జగదీశ్వర్ రెడ్డి.. ఆ ప్రొటీన్ పౌడర్‌ను పాలల్లో కలుపుకుని తాగడం వల్ల, సైనేడ్ ప్రభావంతో శరీరం అంతటా విషం పాకి తక్కువ సమయంలోనే ఆసుపత్రి బెడ్‌పైనే ప్రాణాలు విడిచాడు. అప్పట్లో అది గుండెపోటు లేదా సాధారణ మరణం అని అందరూ భావించినా.. నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత సౌజన్య రాసిన డైరీ, లేఖల ఆధారంగా పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేయడంతో సాదిక్ ఖాన్ పాపం పండింది. సాదిక్ ఖాన్ ఇచ్చిన ఈ సంచలన స్టేట్మెంట్తో కాకినాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక సాధారణ వ్యక్తికి రూల్స్ విరుద్ధంగా, ఎలాంటి పర్మిషన్లు లేకుండా సైనేడ్ లాంటి డేంజరస్ కెమికల్‌ను విక్రయించిన హైదరాబాద్ వర్తకుడు ఎవరు..? అనే కోణంలో ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు.సాదిక్ ఖాన్‌కు సైనేడ్ అమ్మిన ఆ వ్యాపారిని పట్టుకోవడానికి కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్‌కు బయలుదేరాయి. హైదరాబాద్‌లో ఆ కెమికల్ డీలర్లను, సాదిక్ ఖాన్ తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతడిని కూడా అరెస్ట్ చేసి.. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనేది తేల్చనున్నారు.