రెండు వేర్వేరు ఘటనలు కానీ రెండు హిట్ అండ్ రన్ కేసులే. ఏపిలో జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లో డ్రైవర్ పత్తా లేకుండా పోతే... హైదరాబాద్‌లో జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లో డ్రైవర్ కాస్త మానవత్వంగా వ్యవహరించాడు. రెండు మరణాలకు కారణం ర్యాష్ డ్రైవింగే. వీటికి అంటుకున్న పొలిటికల్ టచ్... హీట్‌ను అమాంతం పెంచేసింది. వాళ్లు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో కత్తులు నూరుకునే పరిస్ధితి దాపురించింది.న్యాయస్ధానాలు కాదు మేము విచారిస్తాం మేమే తీర్పులు ఇచ్చేస్తాం. దోషులెవరో మేమే తేల్చేస్తాం అంటున్నారు సోషల్ మీడియా తీర్పరులు. వాళ్లు అంటున్నారని....కొట్టుకుంటున్నారని కాదు కానీ చట్టం ఒకరికి చుట్టమా ... న్యాయం మరొకరికి శత్రువా.. ఇదే ఇప్పుడు తేలాల్సిన..తేల్చాల్సిన ప్రశ్న.
అది జులై 10..శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ.. రాత్రి 9గంటల సమయంలో జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన బైక్... 45 ఏళ్ల వయస్సున్న దానయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో గొర్రెల కాపరి దానయ్య మరణించాడు. హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మాజీమంత్రి, వైసీపీ కీలక నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్. మొదట ఆరవ్ స్నేహితుడు సిద్ధార్ధను A1గా చేర్చిన పోలీసులు... స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసారు. కానీ దానయ్య ను ఢీకొట్టి వెళ్లిపోయింది సిద్దార్ధ కాదు ఆరవ్ అని, సీదిరి అప్పలరాజు ఆడిన డ్రామా బయటకు తెలిసిపోవడంతో... ఆరవ్ పోలీసుల ఎదుట లొంగిపోక తప్పలేదు. తండ్రికొడుకులు ఇద్దరూ జైలుకెళ్లక తప్పలేదు.
అది ఆగష్టు 16.. మధ్యాహ్నం 3గంటలు. హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ జంక్షన్. వేగంగా దూసుకొచ్చిన ఖరీదైన కారు...రోడ్డు క్రాస్ చేస్తున్న భారతి అనే యువతిని ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిన భారతి...డివైడర్ పై పడిపోయింది. వెనువెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించినా ప్రాణం దక్కలేదు. మృత్యువుతో పోరాడిన భారతి అనే పార్ట్ టైమ్ ఉద్యోగిని ఓడిపోయింది. భారతి మరణానికి కారణమైన వ్యక్తి జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్. మాదాపూర్ పోలీసులు సంజూష్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు అని తేలింది. డ్రగ్స్ టెస్ట్ కూడా చేసారట.. అది నెగటివ్ రావడంతో ... స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేసారు.
సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ పై మాత్రం హత్య కేసు సెక్షన్లు పెట్టారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా జైలుకు పంపారు. లేని పొలిటకల్ రంగు పులిమి నానా రచ్చ చేసారు. అదే హైదరాబాద్ లో యాక్సిడెంట్ చేసి చంపేస్తే ఎంపీ కొడుకు కాబట్టి... సంజూష్‌కు బెయిల్ ఇచ్చి వదిలేసారు అని... వైసీపీ గగ్గోలు పెడుతోంది. సీదిరి అప్పల రాజుకు, ఆయన కుమారుడు ఆరవ్‌కు ఒక న్యాయం... ఎంపీ కాబట్టి లింగమనేని రమేష్‌కు, ఆయన కొడుకు సంజూష్‌కు ఒక న్యాయమా అని కొందరు సామాన్యులు కూడా నిలదీస్తున్నారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించాల్సింది న్యాయస్ధానాలు... మీడియా కాదు... సోషల్ మీడియా అంతకన్నా కాదు . కానీ బాధ్యత కలిగిన జర్నలిస్ట్‌గా ఈ రెండు కేస్‌లను పోలీక పెట్టి చూస్తే... రెండు స్పష్ఠమైన తేడాలు కన్పిస్తున్నాయి. మొదట కాశీబుగ్గ గొర్రెల కాపరి దానయ్య కేస్ చూస్తే... యాక్సిడెంట్ చేసాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరవ్... బాధితుడిని కాపాడే ప్రయత్నం చేయలేదు.
వెనువెంటనే హాస్పిటల్‌కు తరలించి ఉంటే ప్రాణాలు నిలిచి ఉండేవనేది ప్రత్యక్ష సాక్షుల వాదన. ఇదీ కాక ఆరవ్ ను తప్పించేందుకు అతని స్నేహితుడు సిద్ధార్ధను ప్రధాన నిందితుడిగా చేర్చారనేది మరొక అభియోగం. ఇందుకు సీదిరి అప్పలరాజు తన పొలిటికల్ పవర్‌ను ఉపయోగించారనేది మరొక వాదన! ఇక హైదరాబాద్ భారతి మృతి విషయానికి వస్తే... యాక్సిడెంట్ చేసాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజూష్... యాక్సిడెంట్ అయిన వెంటనే పారిపోలేదు. బాధితురాలు భారతిని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. విచారణకు సహకరించారు అనేది పోలీసుల వాదన. ఆరవ్, సంజూష్ ఇద్దరూ హిట్ అండ్ రన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. అయితే ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కధనం ప్రకారం .. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ కేస్...లింగమేనేని రమేష్ కొడుకు సంజూష్ కేస్ కు పోలిక పెట్టాల్సిన అవసరమే లేదు. అక్కడొక న్యాయమా ఇక్కడొక న్యాయమా అని నినదించేముందు కాస్త ఆలోచించుకోవాలేమో అన్నట్లుగా ఉంది. ఇక దోషులెవరో తేల్చాల్సింది న్యాయస్ధానమే.