Top story:సంచలనం.. ట్రంప్ టీమ్‌లో ఇరాన్ గూఢచారి… ఆ ఒక్కడే అగ్రరాజ్యం అంతు చూస్తున్నాడా…?

ఇరాన్‌కు యుద్ధ రహస్యాలు లీక్ అవ్వడంపై అమెరికా అధ్యక్షుడి షాకింగ్ స్టేట్మెంట్ ఇది. స్వయంగా తమ ప్రభుత్వంలోనే ఓ గూఢచారి ఉన్నారని పేర్కొన్నాడు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగిల్‌ పైలట్‌ను కాపాడేందుకు నిర్వహించిన ఆపరేషన్‌‌ వివరాలను ఆ గూఢచారి లీక్‌ చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశాడు.

Post Published By: dialnews
Updated : 8 April 2026, 10:09 AM IST

ఇరాన్‌కు యుద్ధ రహస్యాలు లీక్ అవ్వడంపై అమెరికా అధ్యక్షుడి షాకింగ్ స్టేట్మెంట్ ఇది. స్వయంగా తమ ప్రభుత్వంలోనే ఓ గూఢచారి ఉన్నారని పేర్కొన్నాడు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగిల్‌ పైలట్‌ను కాపాడేందుకు నిర్వహించిన ఆపరేషన్‌‌ వివరాలను ఆ గూఢచారి లీక్‌ చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఎఫ్‌-15ఈ ఫైటర్ జెట్ కూలిన తర్వాత ఒక పైలట్‌ను అమెరికన్ బలగాలు రక్షించాయన్న ట్రంప్.. రెండో పైలట్‌ కోసం అమెరికన్ బలగాలు ఇంకా గాలిస్తున్నాయని ఒక అమెరికా మీడియా సంస్థ రాసిన కథనంతోనే ఇరాన్‌‌కు అసలు విషయం తెలిసిందన్నాడు. దీంతో తమ ఆపరేషన్‌ క్లిష్టతరమైందన్నాడు. ఆ వార్త రాసిన జర్నలిస్టుకు ఆ సమాచారం ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశాడు. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. సమాచారం ఎవరిచ్చారో జర్నలిస్టు చెప్పకపోతే.. జైలుకి వెళ్లాల్సివస్తుందని బెదిరించాడు. కానీ, ఎక్కడా ఆ జర్నలిస్టు పేరు గానీ.. ఆ వార్త సంస్థ పేరు గానీ ట్రంప్‌ బయటపెట్టలేదు.

మరోవైపు.. ఇరాన్‌కు సమాచారం లీక్ అయ్యేందుకు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నాడు. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా ట్రంప్‌ అభివర్ణించాడు. అతడిని కనిపెట్టితీరాలని.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని ట్రంప్‌ పేర్కొన్నాడు. ఇక ఎఫ్‌-15ఈ పైలట్‌ను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ వివరాలను ట్రంప్‌ వెల్లడించాడు. మొత్తం 155 విమానాలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపాడు. వీటిల్లో నాలుగు బాంబర్లు, 64 ఫైటర్లు, 48 రీఫ్యూయలింగ్‌ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు. అమెరికా హిస్టరీలోనే శత్రు దేశంలోకి వెళ్లి సొంత పైలట్‌ను రెస్క్యూ చేసిన ఆపరేషన్లలో ఇది టాప్‌లో నిలిచిపోతుందని గొప్పలు చెప్పుకున్నాడు. ఇదంతా ఓకే.. కానీ, తన ప్రభుత్వంలోనే గూఢచారి ఉన్నాడని ట్రంప్ ఇంత పక్కాగా ఎలా చెబుతున్నాడు? దీని వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి?

నిజానికి.. తమ బృందంలో గూఢచారులు ఉన్నారని ఇప్పుడే కాదు.. చాలా కాలంగా ట్రంప్ ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పదేపదే ఈ ఆరోపణలు చేస్తున్నాడు. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా చేస్తున్న వ్యూహాత్మక దాడులు, డ్రోన్ మూవ్‌మెంట్స్, సైనిక రహస్యాలు ఇరాన్‌కు ముందే తెలిసిపోవడమే ఇందుకు కారణం.పెంటగాన్‌లోని ఉన్నత స్థాయిలో ఇరాన్ అనుకూల వ్యక్తులు ఉన్నారని ట్రంప్ వాదిస్తున్నాడు. తాము క్షిపణి దాడులు చేయకముందే ఇరాన్ తన ఆస్తులను వేరే చోటికి మార్చేస్తోందని, ఇది లోపల నుంచి ఎవరో ఒకరు సమాచారం ఇస్తేనే సాధ్యమని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నాడు. తన ప్రత్యర్థులు ఇరాన్‌తో లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకున్నారని, అందుకే అమెరికా సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శిస్తున్నాడు. దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. ముఖ్యంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ట్రంప్ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నట్టు డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణం ప్లానింగ్ లోపం కాదు, లోపల ఉన్న గూఢచారులే అని చెప్పడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఆపరేషన్ అనుకున్నంత విజయవంతం కాకపోయినా, అందులో లోపాలు ఉన్నా, ఆ తప్పును "లీక్" మీదకు తోసేయడం సులభం. ట్రంప్ అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. లీక్ వల్ల ఆపరేషన్ దెబ్బతిందని చెప్పడం ద్వారా, అసలు వైఫల్యానికి తాను బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. ఇది రాజకీయంగా ఒక 'సేఫ్ ఎగ్జిట్' వ్యూహం. మొత్తం వ్యవహారంలో ఆరోపణలే తప్ప లీకు వీరుడిని పట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే, అసలు సమస్య లీకులు కాదు.. సొంత వైఫల్యాలు

 

Published : 
  • 8 April 2026, 10:09 AM IST