ప్రపంచ జనాభాలో సగం, గ్లోబల్ జీడీపీలో తిరుగులేని వాటా ఉన్న కూటమి. సభ్యత్వం కోసం పదుల సంఖ్యలో దేశాలు క్యూ కడుతున్న వేదిక. సింపుల్‌గా చెప్పాలంటే, గ్లోబల్ పవర్ హౌస్ బ్రిక్స్!అలాంటి వేదికపై తమ గళాన్ని వినిపించేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. కానీ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు, విదేశీ రిజర్వుల క్షీణతతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ నాయకత్వం మాత్రం ఇండియా ఇచ్చిన ఆహ్వానాన్ని తోసిపుచ్చింది. ఈ తిరస్కరణకు ప్రధాన కారణం బహిరంగ రహస్యమే. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను ఢాకాకు రప్పించాలన్న పంతమే ఇందుకు మూల కారణం. కానీ, వ్యక్తిగత, అంతర్గత రాజకీయ వైరాన్ని అంతర్జాతీయ సంబంధాలతో ముడివేయడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో బంగ్లాదేశ్ గ్రహించడం లేదు. బ్రిక్స్ వంటి వేదికను వాడుకోకపోతే తీవ్ర స్థాయిలో నష్టపోయేది బంగ్లాదేశే! అదెలాగో టాప్ స్టోరీలో చూద్దాం..
బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో ఉంది.
ఆర్థిక సంక్షోభానికి తోడు ఇంధన సంక్షోభం పీక్స్‌కు చేరడంతో పవర్ కట్స్ పెరిగాయి. ఫలితంగా పరిశ్రమలు మూతపడుతున్నాయి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెనకడుగు వేస్తున్నాయి. సరిహద్దు దేశమైన భారత్ నుంచి విద్యుత్ దిగుమతులు, ఇంధన సరఫరాలు బంగ్లాదేశ్‌కు అత్యంత కీలకం. సంక్షోభ నివారణకు భారత్ సహాయాన్ని కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్‌గా కోరుకుంటున్నామని చెబుతున్న ఢాకా నాయకులు, అదే ఇండియా ఆహ్వానించిన బ్రిక్స్‌కు డుమ్మా కొట్టడం వారి బెదిరింపు ధోరణులకు అద్దం పడుతోంది. సమస్యల పరిష్కారానికి చేతులు కలపాల్సింది పోయి మొండిచేయి చూపడం తమ స్వయంకృతాపరాధమే అవుతుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న కీలకమైన గంగా జలాల ఒప్పందం డిసెంబర్ ఆఖరుతో ముగియనుంది. ఈ ఒప్పందాన్ని సకాలంలో పునరుద్ధరించుకోకపోతే ఉత్తర, పశ్చిమ బంగ్లాదేశ్‌లోని లక్షలాది హెక్టార్ల వ్యవసాయం ఎడారిగా మారే ముప్పు ఉంది. నవంబర్ లేదంటే డిసెంబర్ నెలలో ద్వైపాక్షిక పర్యటన చేస్తామని బీఎన్పీ వర్గాలు చెబుతున్నప్పటికీ, బ్రిక్స్ వంటి గౌరవప్రదమైన వేదికను దాటవేసిన తర్వాత, కీలకమైన జలవనరుల ఒప్పందాన్ని ఎలా రాబట్టుకోగలరన్నది ప్రధాన ప్రశ్న.
నిజానికి.. బ్రిక్స్ అంటే కేవలం భారత్ మాత్రమే కాదు. చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి బలమైన ఆర్థిక శక్తుల సమాహారం. ఇంతటి కీలక కూటమిలో ఆర్థిక సహాయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ పొందడానికి బంగ్లాదేశ్‌కు అద్భుతమైన అవకాశం లభించేది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ ఆంక్షలతో సతమతమవుతున్న వేళ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తోడ్పాటు ఢాకాకు అత్యవసరం. కేవలం ఆతిథ్య దేశమైన భారత్‌పై ఉన్న రాజకీయ అసంతృప్తి, దౌత్ విభేదాలతతో ఈ వేదికను బహిష్కరించడం వల్ల, ఇతర మిత్రదేశాల మద్దతును కూడా ఢాకా స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్టే అవుతుంది. చరిత్రను విస్మరించిన ఏ దేశమూ ముందుకు సాగలేదు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారత సైన్యం చేసిన పోరాటం వెలకట్టలేనిది. ఈ చారిత్రక వాస్తవాన్ని తాము గుర్తిస్తున్నామని ఢాకా వర్గాలు చెబుతున్నా, ప్రస్తుత ఆచరణ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దేశంలో బలపడుతున్న యాంటీ ఇండియా సెంటిమెంట్‌కు గత అవామీ లీగ్ లీడర్లే కారణమని బీఎన్పీ నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఆ వ్యతిరేక భావజాలానికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, దాని ఆధారంగానే తమ దేశ విదేశాంగ విధానాన్ని నడపడం తీవ్రమైన వ్యూహాత్మక లోపం అని విశ్లేషకుల విమర్శిస్తున్నారు.
అంతర్గత రాజకీయాలు వేరు, విదేశాంగ విధానం వేరు. ఇస్లామిస్టుల మెప్పు కోసం, తీవ్రవాద ధోరణి ఉన్న కొన్ని వర్గాలను శాంతింపజేయడం కోసం ప్రధాని తారిక్ రెహమాన్ 'భారత్ పర్యటనలో తమకు స్పష్టమైన లాభాలు ఉండాలి' అనే సాకును వెతుకుతున్నాడు. న్యూఢిల్లీ వెళ్లి ఉత్త చేతులతో వస్తే స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం బంగ్లా నాయకత్వాన్ని వెంటాడుతోంది. కానీ, బలమైన దేశాలతో దౌత్య చర్చలకు కూర్చోకుండా, పర్యటనలే వద్దనుకుంటే పురోగతి ఎలా సాధ్యమవుతుంది? ఇది నాయకత్వ లోపమే తప్ప దౌత్య చతురత కాదని ఢాకాలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక గార్మెంట్ రంగమే. ఈ రంగానికి ముడిసరుకు, పత్తి సరఫరాలో ఇండియా నంబర్ వన్ భాగస్వామి. అంతేకాకుండా, నేపాల్, భూటాన్లతో బంగ్లాదేశ్ వ్యాపార సంబంధాలు కొనసాగాలన్నా భారత భూభాగం ద్వారానే కనెక్టివిటీ సాధ్యం. భారత్‌తో దూరం పెరిగితే రవాణా ఖర్చులు పెరిగిపోతాయి, సప్లై చైన్ అతలాకుతలమవుతుంది. కేవలం ఒక నేతను అప్పగించలేదన్న కోపంతో వేలాది కోట్ల వాణిజ్య ప్రయోజనాలను, రవాణా కారిడార్లను పణంగా పెట్టడం ఢాకాకే శాపంగా మారుతుంది.
దౌత్యంలో మొండివైఖరి చూపినప్పుడు అంతర్జాతీయ సంబంధాలు ఎంత ఘోరంగా బెడిసికొడతాయో శ్రీలంక వంటి దేశాలు ఇటీవలే పాఠాలు నేర్చుకున్నాయి. పొరుగున ఉన్న బలమైన దేశాన్ని శత్రువుగా మార్చుకుని ఏ చిన్న దేశమూ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించలేకపోయింది. భారత్ ఒక బాధ్యతాయుతమైన ప్రాంతీయ శక్తిగా ఆహ్వానాన్ని పంపింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంధనం, నీరు, వాణిజ్య సాయంపై బంగ్లాదేశ్ తన వాణి వినిపించి ఉండాల్సింది. కానీ ఆ తలుపులను స్వయంగా తానే మూసివేసుకోవడం ద్వారా బంగ్లా నాయకత్వం తన గొయ్యి తానే తవ్వుకోవడమే. బంగ్లా ప్రధాని రాకపోవడం వల్ల బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు. కానీ అంతర్జాతీయ సమాజంలో బంగ్లాదేశ్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలబడుతుందా లేదా అస్థిర దేశంగా మిగిలిపోతుందా అన్న సందేహాలు బలపడతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ వేదికలు దొరకడమే ఒక వరం. తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు దొరికిన అవకాశాన్ని తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవాల్సింది పోయి, హసీనా మీద కక్షతో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లను తిరస్కరించడం ఏ విధంగా చూసినా బంగ్లాదేశ్‌కే నష్టం.