ప్రస్తుతం ఇరాన్ తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన దశలో ఉంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేస్తుంటే.. మరోవైపు దేశం లోపల ఉంటూ శత్రువులకు సమాచారం అందిస్తున్న గూఢచారుల ముప్పు పొంచి ఉంది. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరగదు, అది దేశం లోపల కూడా జరుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్ ఎనిమిది మంది మహిళల గురించి ప్రస్తావించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి..? వారు కేవలం నిరసనకారులేనా లేక ఇరాన్ వ్యతిరేక శక్తులు సాకిన గూఢచారులా..? బిటా హెమ్మతి, డయానా తాహెర్ అబాది లాంటి పేర్లు ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. కానీ ఇరాన్ నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం ప్రకారం, వీరు కేవలం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వారు కాదు. యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దేశంలో అశాంతిని సృష్టించడానికి, ప్రజలను రెచ్చగొట్టి అంతర్గత కలహాలు సృష్టించడానికి విదేశీ నిధులు వాడినట్లు ఇరాన్ గుర్తించింది. పాశ్చాత్య దేశాలు ఎప్పుడూ 'మానవ హక్కుల' అనే ఆయుధాన్ని వాడుకుని ఇరాన్ లాంటి స్వతంత్ర దేశాల ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఎనిమిది మంది మహిళల వెనుక అమెరికా గూఢచారి సంస్థ CIA హస్తం ఉందనేది ఇరాన్ ప్రాథమిక వాదన.
యుద్ధ సమయంలో సైనిక స్థావరాల సమాచారాన్ని గానీ, అధికారుల కదలికలను గానీ సోషల్ మీడియా ద్వారా లేదా రహస్య మార్గాల ద్వారా శత్రువుకు చేరవేయడం ఎంత పెద్ద నేరమో తెలుసా..? గజల్ ఘలందరి, వీనస్ హొస్సేన్ వంటి వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే.. వీరు నిరసనల ముసుగులో ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన అంశాలను బయటకు లీక్ చేశారు. ఏ దేశమైనా సరే, యుద్ధ సమయంలో దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారిని క్షమించదు. అమెరికా తన సొంత దేశంలో ఇలాంటి వారిని ఏంచేస్తుందో మనందరికీ తెలుసు, కానీ ఇరాన్ తన చట్టాలను అమలు చేస్తే మాత్రం దాన్ని 'అకృత్యం' అని ప్రచారం చేస్తున్నారు.జనవరి 2026 నిరసనల సమయంలో అరెస్టయిన వారు కేవలం నిరసనకారులు మాత్రమే కాదు, వారు దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ శక్తుల చేతిలో పావులుగా మారారనేది ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి ఘోలమ్ హుస్సేన్ మొహసేనీ ఎజీ స్పష్టంగా ప్రకటించారు: "దేశ భద్రతను పణంగా పెట్టే ఏ వ్యక్తినైనా, వారు ఎవరైనా సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది". ఈ ఎనిమిది మంది మహిళల కేసు కూడా ఇదే కోణంలో విచారణలో ఉంది. శత్రువులతో చేతులు కలిపి సమాచారాన్ని చేరవేసే వారిని "రియటర్స్"గా పరిగణిస్తూ ఇరాన్ తన పట్టును నిరూపించుకుంటోంది.
ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం, ఈ ఎనిమిది మంది మహిళల కార్యకలాపాలకు ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ లేదా అమెరికాకు చెందిన CIA వంటి సంస్థల నుండి ఆర్థిక మరియు సాంకేతిక సహకారం అందింది. యుద్ధం జరుగుతున్న సమయంలో స్టార్‌లింక్ టెర్మినల్స్ ఉపయోగించి రహస్య సమాచారాన్ని విదేశాలకు చేరవేయడం, దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఏ సార్వభౌమ దేశమైనా తన అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించదు, ఇరాన్ చేస్తున్నది కూడా అదే.డొనాల్డ్ ట్రంప్ ఈ మహిళల విడుదల కోసం డిమాండ్ చేయడం వెనుక మానవత్వం కంటే తన రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఇరాన్ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాతో చర్చలు మొదలుపెట్టే ముందు ఇరాన్ ను ఇరకాటంలో పెట్టడానికి, ఆ దేశంలో అశాంతిని ప్రేరేపించడానికి ఇదొక వ్యూహం. ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఈ వార్తలను "ఫేక్ న్యూస్" గా కొట్టిపారేసింది, ట్రంప్ ప్రస్తావించిన ఎనిమిది మందిలో కొందరు ఇప్పటికే విడుదలయ్యారని, మిగిలిన వారిపై విచారణ జరుగుతోందని స్పష్టం చేసింది.
డొనాల్డ్ ట్రంప్ ఈ మహిళల కోసం డిమాండ్ చేయడం చూస్తుంటేనే అర్థమవుతోంది.. వీరు ఆయనకు ఎంత కావాల్సిన వారో అంటుంది ఇరాన్. ఇరాన్ లోపల అస్థిరత సృష్టించడానికి ఉపయోగించిన ఆయుధాలను కాపాడుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇరాన్ న్యాయవ్యవస్థ స్పష్టంగా ఉంది. ఏ ఒక్క బయటి వ్యక్తి జోక్యాన్ని మేము సహించబోం. అది అమెరికా అధ్యక్షుడు అయినా సరే, ఇరాన్ చట్టాలకు ఎవరూ అతీతులు కారు. మౌసవి వంటి గొప్ప యోధులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వేళ, దేశద్రోహానికి పాల్పడే వారిపై కఠినంగా ఉండటం ఇరాన్ ప్రభుత్వ బాధ్యత. ఇరాన్ ఎప్పుడూ మహిళలను గౌరవిస్తుంది, కానీ దేశానికి వెన్నుపోటు పొడిచే వారిని మాత్రం ఉపేక్షించదని ఆ దేశ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎనిమిది మంది మహిళల కేసు కేవలం ఒక న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే. శత్రువుల ప్రచార యుద్ధంలో ఇరాన్ ఎప్పుడూ ఓడిపోలేదు, ఓడిపోదు కూడా అంటున్నారు అక్కడి నాయకులు.