యుద్దంలో సాదాసీదాగా లోంగిపోతుంది అని అంచనా వేసుకున్న ఇరాన్, ఇప్పుడు అమెరికా – ఇజ్రాయిల్ బలగాలకు కొరకరాని కొయ్యగా మారిన విషయం అర్ధమవుతోంది. ఎప్పుడు ఏ ఆయుధాలను ఇరాన్ ప్రయోగిస్తుందో అర్ధం కాక సతమవుతున్నాయి ఆ రెండు దేశాలు. అసలు ఇరాన్ బలం ఏంటో కూడా ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్ కు ఒక క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో యుద్దాన్ని ఇంకొంత కాలం కొనసాగిస్తే అమెరికానే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు యుద్దాన్ని ఆపాలనే ఒత్తిడి అమెరికాపై పెరుగుతోంది.
అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికానే దోషిగా చూస్తుంది. దీనితో యుద్దాన్ని ఆపడమే మంచిది అనే నిర్ణయానికి ట్రంప్ దాదాపుగా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపాలని అనుకోవడం వెనుక బలమైన రాజకీయ, ఆర్థిక మరియు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్ల మార్కును దాటాయి. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతోంది.
యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి, వంటి కీలక ప్రాంతాల్లో రవాణా ఎక్కువ కాలం నిలిచిపోతే, ప్రపంచ చమురు సరఫరాలో 20% ఆగిపోతుంది. ఇది అమెరికాలో ధరలను విపరీతంగా పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఆయన ఇచ్చిన ఎన్నికల హామీల్లో.. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ప్రధానం. ఇప్పుడు అది తగ్గాలంటే యుద్దాన్ని క్లోజ్ చేయడం మంచిది అనే నిర్ణయానికి ట్రంప్ వచ్చినట్లు సమాచారం. యుద్ధ భయంతో స్టాక్ మార్కెట్లు పతనం కావడం ట్రంప్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.
ఇరాన్ నౌకాదళం, వాయుసేన, క్షిపణి వ్యవస్థలు ఇప్పటికే 90% వరకు ధ్వంసం అయ్యాయని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావడం, వారి అణు కార్యక్రమాలు దెబ్బతినడంతో యుద్ధం యొక్క ప్రధాన ఉద్దేశ్యం నెరవేరిందనే భావనలో కూడా ట్రంప్ ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం రెండింటికీ బిలియన్ల కొద్దీ డాలర్ల ఆయుధాలను సరఫరా చేయడం అమెరికా ఖజానాపై భారం పడుతోంది. ఈ నిధులను దేశీయ అభివృద్ధికి మళ్లించాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఈ యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతే.. రాజకీయంగా ట్రంప్ కు అది పెద్ద సమస్య అవుతుంది. ఈ నష్టాన్ని మరింత పెరగకుండా చూడటం ట్రంప్ ప్రాధాన్యతగా అంతర్జాతీయ సమాజం చెప్తోంది. ట్రంప్ ఎప్పుడూ సుదీర్ఘకాలం సాగే ఖరీదైన యుద్ధాలకు వ్యతిరేకి. దీనిని కేవలం ఒక "చిన్న విహారం" వంటి చర్యగానే ముగించాలనే భావనలో కూడా ట్రంప్ ఉన్నట్లు సమాచారం.
సౌదీ అరేబియా, యూఏఈ వంటి మిత్రదేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో, ఆ ప్రాంతంలో స్థిరత్వం కోసం యుద్ధం ఆపాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఇరాన్ నుంచి వచ్చే ప్రమాదాలను ఎదుర్కొంటున్నప్పటికీ, పూర్తి స్థాయి యుద్ధం తమ ప్రాంతానికి ఆర్ధికంగా నష్టం చేస్తుందనే భావనలో ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ లో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని, ఇరాన్ ప్రజలే తమ ప్రభుత్వాన్ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకుంటారు అని.. అందుకు ఇదే సరైన సమయమని ట్రంప్ భావిస్తున్నారు.
యుద్ధాన్ని పొడిగించడం కంటే ఇరాన్లో అంతర్గత మార్పు తీసుకురావడమే మేలనే వ్యూహంలో కూడా ట్రంప్ ఉన్నట్లు కనపడుతోంది. స్వదేశంలో ట్రంప్ పై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ దాడుల కారణంగా అమెరికన్ కంపెనీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. దీనితో కార్పోరేట్ ల నుంచి కూడా ట్రంప్ కు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికన్ చరిత్రలో.. ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో నష్టాలను మిగిల్చింది ఇరాన్ యుద్దమే. అందుకే యుద్దాన్ని ఆపాల్సిందే అంటూ ఆయన సలహాదారులు కూడా ట్రంప్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.