ఇరాన్‌పై యుద్ధమే చేస్తాం:డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు(America President) డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఇరాన్(Iran) విషయంలో తన పంథా ఏమాత్రం మారలేదని స్పష్టం చేస్తూ.. తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

Post Published By: dialnews
Updated : 11 April 2026, 2:56 PM IST

అమెరికా అధ్యక్షుడు(America President) డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఇరాన్(Iran) విషయంలో తన పంథా ఏమాత్రం మారలేదని స్పష్టం చేస్తూ.. తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. శాంతి చర్చల పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదని, పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఊరుకునే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. "ఒప్పందం కుదరకపోతే, అమెరికా దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో దాడి చేస్తాం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా యుద్ధానికే సిద్ధమన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. యుద్దాన్ని ఆపే దిశగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్(JD Vance) తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ మాత్రం మరోసారి యుద్ధం బాటలో పయనిస్తున్నారు. శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే, మరోవైపు మారణాయుధాల ప్రయోగం గురించి మాట్లాడటం గమనార్హం. ట్రంప్ తాజా హెచ్చరికలతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి.

అగ్రరాజ్య అధ్యక్షుడు ఇంత బహిరంగంగా దాడి చేస్తామని హెచ్చరించడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ తీరు చూస్తుంటే ఆయన శాంతి కంటే యుద్ధాలకే మొగ్గు చూపుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ట్రంప్ మళ్ళీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇరాన్ అసహనం వ్యక్తం చేస్తోంది.

అయితే.. ఇరాన్ తన 10 సూత్రాల శాంతి ప్రణాళికలో అమెరికా సైన్యం వెనక్కి వెళ్ళాలని, ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతోంది. దీనికి ట్రంప్ ఏమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ట్రంప్ పద్ధతి చూస్తుంటే, ఆయన "మొదట చర్చలు - వినకపోతే యుద్ధం" అనే సూత్రాన్ని నమ్ముతున్నట్లుగా ఎద్దేవా చేస్తోంది అంతర్జాతీయ సమాజం. ఈ రెండు వారాల విరామం తర్వాత యుద్ధం మళ్ళీ మొదలవుతుందా లేదా శాంతి నెలకొంటుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న.

Published : 
  • 11 April 2026, 2:56 PM IST