Top story: ఆ రోజు పోలీస్‌ స్టేషన్‌లో ఏం జరిగిందంటే ? కీలక విషయాలుచెప్పిన కానిస్టేబుల్స్‌..!

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుళ్లు కే.అశోక్, జంగం నాని ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Post Published By: dialnews
Updated : 1 July 2026, 12:15 PM IST

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుళ్లు కే.అశోక్, జంగం నాని ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మూడు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న వీరు, సోమవారం సాయంత్రం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ వద్దనున్న ఏసీపీ మానస కార్యాలయానికి వెళ్లి లొంగిపోయారు. పోలీసులు వాళ్లను అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. లొంగిపోయిన వెంటనే సిట్ దర్యాప్తు అధికారి ఎల్. సుధాకర్ ఆధ్వర్యంలో అశోక్, నానిలను వేర్వేరుగా సుదీర్ఘంగా ప్రశ్నించారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత స్టేషన్‌లో ఏం జరిగింది ? ఇన్‌స్పెక్టర్ నాగరాజుతో కలిసి మీరంతా ఏం చేశారు ? అసలు మీరు చూసింది ఏమిటి ? అని సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణకు రాకుండా ఎందుకు పారిపోయారని అడగ్గా.. భయం వల్లే వెళ్లిపోయామని వాళ్లు బదులిచ్చినట్లు తెలుస్తోంది.

విచారణలో వీరిద్దరూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అంటున్నారు పోలీసులు. తాను సాయికృష్ణను అసలు చూడలేదని, అతడి కుటుంబ సభ్యులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని హెడ్ కానిస్టేబుల్ నాని చెప్పాడు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో, ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఆదేశాలతో తాను, మరో ఎస్ఐ కలిసి వేరే కేసులో నిందితుడ్ని పట్టుకోవడానికి చెన్నై వెళ్లామని నాని వివరించాడు. ఈ విషయాన్ని జనరల్ డైరీలో కూడా రాసినట్లు తెలిపాడు. మరోవైపు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ మాత్రం కీలక ప్రశ్నలకు మౌనం వహించాడు. సాయికృష్ణ నేరాల గురించి మాట్లాడిన అశోక్.. మార్కాపురం నుంచి అతడిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందని అడిగితే మాత్రం పెదవి విప్పలేదు. ప్రశ్నలను దాటవేస్తుండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ అధికారులు తాజాగా మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలతో పాటు ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు అత్యంత సన్నిహితుడైన సురేష్‌ను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడంతో అశోక్, నానిలను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రైం కానిస్టేబుళ్లు బాబూరావు, సాంబయ్యలను కూడా సిట్ విచారిస్తోంది. ఇందులో బాబూరావు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరో పక్క సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణను హైకోర్టు జూలై 15కు వాయిదా వేసింది. పోలీసుల అదుపులో ఉన్న కానిస్టేబల్స్‌తో పాటు.. కొత్తగా చేర్చిన నిందితుల విచారణ తరువాత ఈ కేసులో క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది.

Published : 
  • 1 July 2026, 12:15 PM IST