Top story: మార్గదర్శి కేసులో మొదటి నుండి ఏం జరిగింది..? మార్గదర్శి కేసు క్లోజ్.. 20 ఏళ్ల వివాదానికి తెర.!

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా.. అంటే 20 ఏళ్లుగా నడుస్తున్న అత్యంత సంచలన 'మార్గదర్శి ఫైనాన్సియర్స్' వివాదానికి సుప్రీంకోర్టులో ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం

Post Published By: dialnews
Updated : 22 August 2026, 10:27 AM IST

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా.. అంటే 20 ఏళ్లుగా నడుస్తున్న అత్యంత సంచలన 'మార్గదర్శి ఫైనాన్సియర్స్' వివాదానికి సుప్రీంకోర్టులో ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది. అంతేకాదు.. 'ఈ కేసు దర్యాప్తు చేయడానికి మీరెవరు? ఇది మీ వ్యక్తిగత వివాదంలా ఉంది' అంటూ ఉండవల్లిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కథ ఏంటి? 2006-2008 కాలంలో ఏం జరిగింది? రామోజీరావు సంస్థలపై ఉండవల్లి ఎందుకు అంతగా పోరాడారు? సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ వివాదం ఎలా ముగిసింది?

అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే.. అది 2006వ సంవత్సరం. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. కాంగ్రెస్ నేతగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేది కేవలం ఒక హిందూ అవిభక్త కుటుంబంకి సంబంధించిన సంస్థ అని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఇటువంటి అన్‌ఇన్‌కార్పొరేటెడ్ సంస్థలు ప్రజల నుండి డిపాజిట్లు సేకరించకూడదని ఆయన వాదించారు. మార్గదర్శి సంస్థ వేల కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని ఉండవల్లి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.

అయితే ఈ ఆరోపణలపై ఈనాడు అధినేత, దివంగత రామోజీరావు అప్పట్లోనే చాలా స్పష్టంగా స్పందించారు. చట్టపరమైన లోపాలు ఏమైనా ఉంటే తాము డిపాజిట్ చేసిన ప్రజల సొమ్మును ఒక్క రూపాయి కూడా పోకుండా తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే.. చందాదారులకు నమ్మకం కలిగిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిటర్ల సొమ్మును వెనక్కి ఇవ్వడం ప్రారంభించింది. కాలక్రమేణా ఇప్పటివరకు దాదాపు రూ.2,591 కోట్లకు పైగా డిపాజిట్లను వడ్డీతో సహా ఖాతాదారులకు పూర్తిగా వెనక్కి చెల్లించేశారు. ఎవరైనా క్లెయిమ్ చేయని వారు ఉంటే వారి కోసం మరో రూ.5.23 కోట్లను ఒక ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో భద్రపరిచారు. అంటే, మార్గదర్శి వల్ల ఏ ఒక్క డిపాజిటర్ కూడా ఒక్క రూపాయి నష్టపోలేదు సరే కదా.. కనీసం ఒక్కరంటే ఒక్క డిపాజిటర్ కూడా మార్గదర్శిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

మరోవైపు కోర్టుల్లో లీగల్ బ్యాటిల్ నడుస్తూనే ఉంది. ఖాతాదారులందరికీ డబ్బులు చెల్లించేయడం, ఎవరూ బాధితులు లేకపోవడంతో.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే, దీనిని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 'చట్ట ఉల్లంఘన జరిగింది కాబట్టి కేసు నడవాల్సిందే' అని ఉండవల్లి పట్టుబట్టారు. దీంతో సుప్రీంకోర్టు గతంలో ఈ వ్యవహారాన్ని తిరిగి హైకోర్టుకు పంపి.. డిపాజిటర్లు ఎవరైనా ఉంటే వారి అభ్యంతరాలను స్వీకరించాలని చెప్పింది. కానీ, హైకోర్టు నోటీసులు ఇచ్చినా కూడా ఒక్క చందాదారుడు కూడా మార్గదర్శికి వ్యతిరేకంగా ముందుకు రాలేదు. దీనితో హైకోర్టు కేసును పూర్తిగా కొట్టేయగా, ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై తుది విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. 'అసలు ఈ పిటిషన్ వేయడానికి మీ లోకస్ స్టాండీ అంటే.. అర్హత ఏంటి? అసలు మీరు ఎవరు?' అని ఉండవల్లిని ప్రశ్నించింది. డిపాజిట్ చేసిన వారెవరూ కోర్టుకు రానప్పుడు, మీకెందుకు అంత ఆసక్తి అని అడిగింది. అంతేకాదు, ఈ కేసు హిస్టరీ మొత్తాన్ని గమనిస్తే ఇది ప్రజా ప్రయోజనాల కోసం వేసినట్లు లేదు.. కేవలం మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మార్గదర్శి తరపు న్యాయవాదులు అందరికీ డబ్బులు సర్దేసిన విషయాన్ని కోర్టుకు వివరించడంతో.. ఉండవల్లి వాదనలను తోసిపుచ్చుతూ ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీనితో దాదాపు 20 ఏళ్లుగా రాజకీయంగా, చట్టపరంగా సాగుతున్న మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివాదానికి తెరపడినట్లయింది. డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కడిగిన ముత్యంలా మార్గదర్శి బయటపడిందని చందాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 22 August 2026, 10:27 AM IST