"ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసే అగ్రరాజ్యం అమెరికాకు.. సింహస్వప్నంలా మారిన దేశం ఏదైనా ఉందంటే అది ముమ్మాటికీ ఇరానే." అవును, తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 'ఎకనామిక్ డి-డే' అంటే.. ఇప్పటివరకు చరిత్రలోనే ఏ దేశంపైనా తీసుకోనంత అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షల హెచ్చరికలపై ఇరాన్ ఏమాత్రం బెదరలేదు సరే కదా.. పైగా అమెరికా పరువు పోయేలా సోషల్ మీడియా వేదికగా దారుణంగా ఆడుకుంది. "ఫ్రోజన్ ఫారిన్ పాలసీ.. ఎకానమీని ఫ్రీజ్ చేస్తుంది" అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఇరాన్ ఆర్మీ అమెరికా చేతకానితనాన్ని ఎలా ఎండగట్టింది?
అసలు ఏం జరిగిందంటే.. బుధవారం టెక్నాలజీ రంగ ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ను ప్రపంచ దేశాల నుంచి పూర్తిగా ఒంటరిని చేయడానికి, ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి చరిత్రలోనే అత్యంత ఘోరమైన "ఎకనామిక్ డి-డే" ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్లో సెటైర్లు వేశారు. "ధరలు అదుపు చేయడానికి ఘనీభవించిన మాంసాన్ని దిగుమతి చేసుకున్నట్లు.. బాండ్ల కోసం ఫ్రోజన్ ఈల్డ్స్‌ను, గృహాల కోసం ఫ్రోజన్ కొనుగోలుదారులను, జీతాల కోసం ఫ్రోజన్ పే-చెక్స్‌ను తెస్తారా? మీ ఘనీభవించిన విదేశాంగ విధానం మీ ఆర్థిక వ్యవస్థనే స్తంభింపజేస్తుంది" అంటూ ఎద్దేవా చేశారు.
ఇంతటితో ఆగకుండా ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ ఒక సంచలన నాలుగు ప్యానెళ్ల వ్యంగ్య కార్టూన్ షేర్ చేశారు. అదేంటంటే.. ఒక వ్యక్తి "చరిత్రలోనే అత్యంత క్రషింగ్ ఎకనామిక్ ఆపరేషన్" అని రాసి ఉన్న ఒక పెద్ద బూమరాంగ్ ఆయుధాన్ని ఇరాన్ పైకి విసురుతాడు. కానీ ఆ ఆయుధం కాస్తా గాల్లో తిరిగి వచ్చి.. విసిరిన వ్యక్తి ముఖానికే బలంగా తగులుతుంది. అంటే అమెరికా విధించే ఆంక్షలు తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థకే బూమరాంగ్‌లా తగిలి నాశనం చేస్తాయంటూ ఇరాన్ ఎంత ధైర్యంగా వెక్కిరించిందో దీని బట్టే అర్థమవుతోంది.
మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి సర్దార్ మొహేబీ అమెరికాపై మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "అమెరికా అధ్యక్షుడు ఆర్థిక యుద్ధానికి ఆర్డర్ ఇచ్చానని రొమ్ము విరుచుకుంటున్నారు.. కానీ మిలిటరీ పరంగా ఇరాన్ చేతిలో అమెరికా ఎదుర్కొన్న పరాజయానికి, అవమానకరమైన ఓటమికే ఈ ఆర్థిక ఆంక్షలు ప్రత్యక్ష నిదర్శనం" అని తోసిపుచ్చారు. ఒకవేళ మీరు మిలిటరీ పరంగా గెలిచి ఉంటే.. ఇలా ఆర్థిక యుద్ధాలు ప్రకటించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అంటూ అమెరికా చేతకానితనాన్ని ప్రపంచం ముందు పెట్టారు.
ఇరాన్ విదేశాంగ శాఖ మరియు రక్షణ శాఖలు సంయుక్తంగా ఒకే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇరాన్‌కు యుద్ధాలు, ఆంక్షలు కొత్త కాదు. గత 47 ఏళ్లుగా ఇరాన్ ఏదో ఒక రూపంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూనే ఉంది. "మా దేశ ఆర్థిక మూలాలన్నింటిపై దశాబ్దాలుగా ఆంక్షలు ఉన్నాయి, శత్రువు చేసే ప్రతి దుశ్చర్యకూ మా దగ్గర ప్రత్యామ్నాయ వ్యూహం సిద్ధంగా ఉంది.. మేము అమెరికాను బైపాస్ చేసి ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలను సులువుగా కొనసాగిస్తున్నాం, భవిష్యత్తులో మా ఆర్థిక విజయాల ఫలితాలు మీరే చూస్తారు" అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తేల్చి చెప్పారు. అమెరికా కేవలం తమ ప్రజల్లో ఒక అపోహ సృష్టించడానికి మాత్రమే ఇదంతా చేస్తోందని కొట్టిపారేశారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇరాన్‌ను కూల్చేస్తామంటూ హెచ్చరిస్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము తగ్గేదే లేదంటూ ప్రపంచ దేశాల ముందు సీన్ రివర్స్ చేసింది.