Top Story: జగన్ షాడో ఎక్కడ… సజ్జలను పక్కన పెట్టేశారా…?

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్త చర్చకు దారి తీశాయి. గత ఐదేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Post Published By: dialnews
Updated : 14 March 2026, 11:20 AM IST

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్త చర్చకు దారి తీశాయి. గత ఐదేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంటే జగన్ పక్కనే ఉండి ప్రోటోకాల్ చూసుకునే సజ్జల, ఈసారి కనీసం ఫోటోల్లో కూడా లేకపోవడం పార్టీ కేడర్‌లో రకరకాల అనుమానాలకు తెరలేపింది.గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డికి షాడోగా సజ్జల పేరు మారుమోగిపోయింది.

పార్టీలో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా సజ్జల కనుసన్నల్లోనే జరిగేది. అయితే, గత ఎన్నికల్లో వైసీపీ చవిచూసిన ఘోర పరాజయానికి సజ్జల అనుసరించిన వ్యూహాలే కారణమని పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు చాలామంది సజ్జల వైఖరి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆయనను కావాలనే పక్కన పెట్టారా..? అన్న చర్చ మొదలైంది.వేడుకల సందర్భంగా జగన్ పక్కన దేవినేని అవినాష్ వంటి కొద్దిమంది మినహా, ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగిన సీనియర్లంతా ముఖం చాటేయడం గమనార్హం. ముఖ్యంగా పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో చక్రం తిప్పిన సజ్జల కనిపించకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది.

పాత ముఖాలను పక్కన పెట్టి కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకునే క్రమంలో జగన్ రెడ్డి స్వయంగా సజ్జలను దూరం పెట్టారా లేక అంతర్గత విభేదాల వల్ల ఆయనే తప్పుకున్నారా అన్నది ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది.పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇంత నిస్సారంగా జరగడం, ముఖ్యనేతలు గైర్హాజరు కావడం చూస్తుంటే వైసీపీ యంత్రాంగంలో తీవ్ర స్తబ్దత నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. కేవలం జెండా ఎగురవేసి చేతులు దులుపుకోవడం కాకుండా, చెల్లాచెదురైన క్యాడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో జగన్ టీమ్ విఫలమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సజ్జల లేని పార్టీ ఆఫీసు కొత్త సంకేతాలను ఇస్తున్నా, పార్టీని మళ్లీ గాడిలో పెట్టే శక్తి ఈ కొత్త టీమ్‌కు ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

Published : 
  • 14 March 2026, 11:20 AM IST