తండ్రికి కొడుకు పై కన్నా కూతురు పైనే ప్రేమ ఎక్కువ ఉంటుంది.ఒకటే కూతురైతే... నా ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది. పుట్టి నింటి నుంచి మెట్టినింటికి కూతురిని పంపినప్పుడు కన్నీరు పెట్టని తండ్రి ఉండడు. అలాంటి కూతుర్ని.... నేను చస్తే నా శవం చూడ్డానికి కూడా రావద్దు.... నా ఇంటి గడప తాక వద్దు... అని ఆ తండ్రి ఆదేశించాడంటే... ఆ నాన్న హృదయం వెనక ఎంత పంతం ఉందో అర్థం అవుతుంది. చివరికి నిజంగానే తండ్రి కన్నుమూస్తే కడచూపుకు కూడా ఆ కూతుర్ని రానివ్వలేదు చుట్టూ ఉన్నవాళ్లు. ఇంతకంటే దారుణమైన.... దయనీయమైన దృశ్యం మరొకటి ఉంటుందా? మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూస్తే, ఆయనను చివరిసారిగా చూసుకునేందుకు కూడా కుమార్తె క్రాంతికి అవకాశం దక్కలేదు. ఇలాంటి దృశ్యం ఎక్కడో సినిమాల్లో చూడడమే తప్ప... తెలుగు రాష్ట్రాలు ప్రత్యక్షంగా చూసేయ్.
తండ్రి చివరి చూపు దక్కకుండానే.... తన కన్నీటికి తానే సమాధానం చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయింది కూతురు క్రాంతి. ఏపీలో రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో..... ఒక తండ్రి కూతురు అనుబంధాన్ని కూడా పాలిటిక్స్ ఎలా శాసిస్తాయో.... చివరికి కుటుంబాల్లో ఎలాంటి చిచ్చు పెడతాయో ముద్రగడ, ఆయన కుమార్తె క్రాంతి ఉదంతమే ఒక ఉదాహరణ.కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభనికి, ఆయన కుమార్తె క్రాంతికి ఆస్తి గొడవలు లేవు. ఉన్నవన్నీ రాజకీయ విభేదాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపులకు ప్రాతినిధ్యం వహించడానికి ముద్రగడ వ్యతిరేకించారు. కాపులకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు వెంట పవన్ వెళ్లడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. వైసీపీలో చేరి జగన్కు బాసటగా నిలిచారు. ముద్రగడ వైసీపీకి వెళ్లడాన్ని ఆయన కుమార్తె క్రాంతి వ్యతిరేకించింది. బహిరంగంగానే తండ్రినీ విమర్శించింది. అంతేకాదు జనసేనకు మద్దతు పలికింది.
దీంతో ముద్రగడ రగిలి పోయారు. తన కూతురు తనకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కడం... జీర్ణించుకోలేకపోయారు. కూతురు క్రాంతిని కుటుంబ బహిష్కరణ విధించారు. క్రాంతి కూడా తక్కువ తినలేదు. టిడిపి, జనసేన ప్రభావానికి లోనై తండ్రి పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది.అది ముద్రగడను మరింత బాధించింది.తాను చనిపోతే... తన మొఖం చూడడానికి కూతుర్ని రానివ్వొద్దని ముందే చెప్పారాయన. ఆయన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తూ పద్మనాభం కుమారుడు, ఇతర బంధువులు చివరి చూపుకు క్రాంతిని అనుమతించలేదు.కుల రాజకీయాలు... బ్రష్టు పట్టిన వర్గ పోరాటాలు... తండ్రి కూతుర్ని విడదీసేయ్. పంతాలకు పోయి ఇద్దరూ శపదాలు చేసిచివరి చూపులు లేకుండా మిగిలిపోయారు. కుటిల రాజకీయాల వల్ల కూతురు దూరమైపోయింది అనే మానసిక వేదన ముద్రగడని మరింత కుంగ తీసింది. భావోద్వేగాల మధ్య కూతురి కన్నీటి వీడ్కోలు లేకుండానే జననేత మట్టిలో కలిసి పోయారు.