ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కడప జిల్లా ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన కేంద్రంగానే ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి వరకు ఆ కుటుంబం చుట్టూనే ఉమ్మడి కడప జిల్లా రాజకీయం తిరుగుతోంది. అయితే, ఇటీవల కాలంలో వైఎస్సార్ కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలు జిల్లా రాజకీయ రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభమవడంతో కడప జిల్లా రాజకీయాల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఆయన చిన్నాన్న, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
కూటమి మద్దతుతో లేదా స్వతంత్రంగా స్థానిక పోరులో ఆమె కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు వైఎస్సార్సీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు సరిగ్గా ముందు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో దారుణంగా హత్యకు గురయ్యారు. మొదట్లో గుండెపోటుగా ప్రచారం జరిగినప్పటికీ, ఆ తర్వాత అది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా బయటపడింది. తండ్రి హత్యకు బాధ్యులైన అసలైన దోషులకు శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి సుదీర్ఘ న్యాయపోరాటానికి దిగారు. CBI విచారణ వేగవంతమైన క్రమంలో, ఈ హత్య వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల హస్తం ఉందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు వరుసకు తమ్ముడైన అవినాష్ రెడ్డికి కొమ్ముకాస్తున్నారని, సీబీఐ విచారణను సైతం మందగించేలా చేశారని సునీత తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
ఈ క్రమంలోనే జగన్ తో పాటు వైఎస్ కుటుంబంతో సునీతకు బాహాటంగానే విబేధాలు వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ సునీత కడప పార్లమెంట్ పరిధిలో ముమ్మర ప్రచారం చేశారు. “నా తండ్రిని చంపిన వారికి రాజకీయ రక్షణ కల్పిస్తున్న వైఎస్సార్సీపీకి ఓటు వేయకండి” అని ప్రజలను బహిరంగంగానే కోరారు. తాజాగా నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రెండూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ సమయంలో కడప జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ సునీత పేరును తెరపైకి తీసుకువచ్చారని సమాచారం. వైఎస్ సునీత స్వయంగా కడప జెడ్పీటీసీ బరిలో నిలుస్తారా లేక తన సమీప బంధువులను నిలబెట్టి గెలిపిస్తారా అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పులివెందుల జెడ్పీటీసీ స్థానం నుంచి తన బంధువు ప్రదీప్ రెడ్డిని కూటమి అభ్యర్థిగా పోటీ చేయించి, కడప జెడ్పీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేలా సునీత వ్యూహం రచిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ సునీత నేరుగా పోటీ చేయకపోయినా, కూటమి తరఫున కడప జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తే వైఎస్సార్సీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆ పార్టీ నాయకులు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా వివేకా హత్య ఉదంతాన్ని సునీత మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తే, సెంటిమెంట్ పరంగా తమ గ్రాఫ్ మరింత పడిపోతుందని వైఎస్సార్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. 2024 శాసనసభ ఎన్నికల్లో పులివెందులలో జగన్ గెలిచినప్పటికీ, వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు తన సొంత గడ్డ అయిన కడప జిల్లాలో స్థానిక ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలు వస్తే పార్టీ మనుగడకే ప్రమాదమని జగన్ భావిస్తున్నారు.
ఇటువంటి క్లిష్ట సమయంలో వైఎస్ సునీత నేరుగా కడప రాజకీయాల్లో వేలు పెట్టడం, కూటమికి మద్దతుగా ప్రచారంలోకి దిగడం జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా అతిపెద్ద షాక్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ కుటుంబం వెంటే నడిచిన కడప జిల్లా ఓటర్లు, ఇప్పుడు వివేకా కుమార్తె పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని కూటమి వైపు మొగ్గు చూపితే, కడపలో వైఎస్సార్సీపీ కోటలు బద్దలవడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. గతంలో కేవలం న్యాయపోరాటాలకే పరిమితమైన డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి, ఇప్పుడు ప్రజాతీర్పు ద్వారానే తన తండ్రి హత్యకు ప్రత్యక్ష జవాబు చెప్పాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో సునీత తీసుకోబోయే నిర్ణయం వైఎస్సార్ జిల్లా రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కడప బరిలో సునీత అడుగుపెడితే, అది జగన్ నాయకత్వానికి, వైఎస్సార్సీపీ వర్గాలకు అది అతిపెద్ద పరీక్ష కానుంది.