మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. న్యూజిలాండ్ మహిళల జట్టు ఏకంగా 347 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి.. వన్డే చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ సాధించిన ఈ అద్భుత విజయంతో భారత మహిళల జట్టు పేరిట ఉన్న గత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది
. గతేడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అప్పట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికా నిర్దేశించిన 347 పరుగుల కొండంత లక్ష్యాన్ని కివీస్ ఛేదించడంతో భారత్ రెండో స్థానానికి పడిపోయింది.ఉమెన్స్ క్రికెట్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతుందనడానికి న్యూజిలాండ్ సాధించిన ఈ విజయమే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ హాఫ్ సెంచరీలతో రాణించగా.... చివర్లో క్లో ట్రయాన్ కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
న్యూజిలాండ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ అమేలియా కెర్ కీలక పాత్ర పోషించింది. 347 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జట్టు వికెట్లు కోల్పోతున్నా.. అమేలియా కెర్ మాత్రం చివరి వరకు పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చింది. కేవలం 139 బంతుల్లో 23 ఫోర్లుస ఒక సిక్సర్‌తో అజేయంగా 179 పరుగులు చేసి జట్టును గెలిపించింది. ముఖ్యంగా చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. నాడిన్ డిక్లర్క్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు బాది 2 బంతులు మిగిలి ఉండగానే గెలిపించింది. ఈ అద్భుత విజయం తర్వాత మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే చివరి వన్డే ఏప్రిల్ 4న జరగనుంది.