టీట్వంటీ వరల్డ్ కప్ ముందు భారత్ హాట్ ఫేవరిట్ అనుకున్నారంతా..! ఇక అయితే కప్ ఒడిలో వాలినంతగా భావించారు. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత అనుమానాలు మొదలయ్యాయ్. ఈజట్టుతో కప్ గెలవడం.. హిమాలయాలు ఎక్కడం కన్నా కష్టం అనే కామెంట్లు వస్తున్నాయి.సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఇండియా టీమ్ బలాబలాలను ఖుల్లం ఖుల్లాగా తేల్చి పడేసింది. టోర్నీ ఆరంభం నుంచే జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అండర్ డాగ్స్... అమెరికా, నమీబియాలపై ..
ఏదోలా గెలిచేశామనిపించింది సూర్యకుమార్ సేన. ఎందుకంటే.. ఆయా దేశాలు కూడా భారత్ లాంటి జట్టుకు గట్టి పోటీ ఇచ్చాయి. అప్పుడే ఏదో తేడా కొడుతుందనిపించింది సగటు భారత క్రికెట్ ప్రేమికుడికి. అయితే పాకిస్తాన్ మీద మాత్రం కాస్త రాణించడంతో గ్రూప్ దశలో టాపర్‌గా అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా.గ్రూప్ దశలో అంటే అండర్ డాగ్స్ లాంటి జట్లు ఉన్నాయి కాబట్టి... ఆట నల్లేరుపై నడకలా సాగిపోయింది.ఇప్పుడు సూపర్ 8లో అలా కాదు.. ఉన్న జట్లన్నీ సూపర్ ఫామ్‌పై ఉన్నవే. సౌతాఫ్రికా.. ఆల్‌రౌండ్ షో ముందు మన బ్యాటర్లు, బౌలర్లు తేలిపోయారు.
బ్యాటర్లందరూ ఎంతవేగంగా పెవిలియన్ కు చేరదామా అన్నట్లు కనిపించారు. శివం దుబె తప్పిస్తే.. ఎవరూ బాధ్యతగా ఆడింది కనిపించలేదని చెప్పక తప్పదు.ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. వచ్చే రెండు మ్యాచులు మంచి రన్‌రేట్‌తో గెలిస్తే తప్పా సెమీస్ బెర్త్ దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. దీనికి తోడు అటు చూస్తే విండీస్ ధనా ధన్ అంటూ ఐపీఎల్ ఆట తీరును తలపిస్తోంది. జింబాంబ్వేపై భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఈ గ్రూపులో ఇండియా ప్రస్తుతం మూడోస్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో విండీస్, సౌతాఫ్రికా నిలిచాయి.
మరి ఇలాంటి జట్లను.. ఈ నాసిరకపు ప్రదర్శనతో భారత్ డీ కొట్టి నిలబడగలదా..? ఈపరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరడం.. హిమాలయ పర్వతాన్ని అధిరోహించడం కన్నా కష్టంగా మారిందని చెప్పాలి. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడంతో పాటు, పాతాళానికి పడిపోయిన రన్ రేట్‌ను కూడా సరిచేసుకోవాలి. అయితే ఈ దారుణ పరిస్థితులకు ప్రధాన కారణం మన ఓపెనర్లు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడీ ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు అతిపెద్ద భారంగా మారింది.
ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొన్న మొత్తం 20 జట్లలో టీమిండియా ఓపెనింగ్ జోడీనే అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఓపెనింగ్ భాగస్వామ్యంలో భారత్ సగటు కేవలం 6.8 పరుగులు మాత్రమే. మనకంటే చిన్న జట్టైన ఒమన్ సగటు 10 పరుగులు.. ఐర్లాండ్, యూఏఈ, అమెరికా జట్ల ఓపెనర్లు కూడా మనకంటే మెరుగ్గా రాణించడం సిగ్గుచేటు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు, అత్యుత్తమ బ్యాటర్లు ఉన్న జట్టుకు ఇలాంటి రికార్డు రావడం నిజంగానే అభిమానుల గుండెను రగిలిస్తోంది.
అభిషేక్ శర్మ ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. బంతిని బాదడమే లక్ష్యంగా క్రీజులోకి వస్తున్న ఈ ఇద్దరు, కనీసం పవర్ ప్లే కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ కాగితంపై చూస్తే ఓహో అనిపిస్తోంది. కానీ మైదానంలో దిగిన సమయంలో మాత్రం కాగితపు పులులను తలపిస్తోంది. ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, సంజూ శామ్సన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్.. ఇలా చెప్పుకుంటే చాంతాడంత లిస్టే.. కానీ ప్రస్తుతం భారత్ ఫామ్ చూస్తుంటే మాత్రం కప్ గెలుస్తుందన్న ఆశలు అభిమానుల్లో కనిపించడం లేదు.