ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్.. ప్రతీ అంశం ఇక్కడ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇలాంటి మెగా టోర్నీలో కేవలం ప్లేయర్ల ప్రదర్శనే కాదు, కెప్టెన్ల భవిష్యత్తు కూడా ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ముగ్గురు కీలక కెప్టెన్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అజింక్యా రహానేల కెరీర్ డైలమాలో పడింది. ఈ ముగ్గురి ప్రదర్శనపై వారి వారి ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్నాయని, త్వరలో జరగబోయే సమీక్షా సమావేశాల్లో వీరి కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకోనున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. జట్ల వైఫల్యాలు, వ్యూహాత్మక లోపాలు వీరి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి.లక్నో సూపర్ జెయింట్స్ వైఫల్యం ఈ సీజన్లో అత్యంత ఒత్తిడికి గురైన కెప్టెన్‌గా రిషబ్ పంత్ నిలిచాడు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం యాజమాన్యాన్ని ఆగ్రహానికి గురిచేసింది. పంత్‌పై ఫ్రాంచైజీ కోట్లు కుమ్మరించినప్పటికీ.. దానికి తగ్గ ఫలితాలు రాలేదు. 11 మ్యాచ్‌లలో కేవలం 251 పరుగులు చేయడం, అందులోనూ స్ట్రైక్ రేట్ 138 వద్ద ఆగిపోవడం పంత్ ఇమేజ్‌కు గండికొట్టింది. బ్యాటింగ్ ఆర్డర్లో పదేపదే చేసిన ప్రయోగాలు, జట్టు ఎంపికలో స్పష్టత లేకపోవడం లక్నో కొంపముంచాయి. ముఖ్యంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా దూకుడు స్వభావం దృష్ట్యా, వచ్చే సీజన్లో పంత్ కెప్టెన్‌గా కొనసాగడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి అక్షర్ పటేల్‌పై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అతను కెప్టెన్‌గా గానీ, ఆటగాడిగా గానీ ఆకట్టుకోలేకపోయాడు. ఒక ఇన్నింగ్స్‌లో చేసిన 56 పరుగులు మినహాయిస్తే, మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కలిపి అక్షర్ పటేల్ చేసిన పరుగులు కేవలం 44 మాత్రమే. 112 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం టీ20 ఫార్మాట్లో ఆమోదయోగ్యం కాదు.
బౌలింగ్‌లో కూడా తనను తాను పూర్తిగా ఉపయోగించుకోవడంలో అక్షర్ విఫలమయ్యాడు. జట్టు మేనేజ్మెంట్లో రాబోయే మార్పులు, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పగ్గాలు చేపట్టనుండటంతో, అక్షర్ కెప్టెన్సీని మార్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది.కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రహానే అనుభవంపై నమ్మకం ఉంచింది, కానీ ఆధునిక ఐపీఎల్ వేగాన్ని అందుకోవడంలో రహానే తడబడ్డాడు. అతని స్ట్రైక్ రేట్ 133 మాత్రమే ఉండటం, పవర్‌ప్లేలో దూకుడుగా ఆడలేకపోవడం జట్టుపై ఒత్తిడి పెంచింది. రహానే, యువ ఆటగాడు రఘువంశీ జోడీ ఆరంభంలోనే ఇన్నింగ్స్‌ను నెమ్మదింపజేయడం కేకేఆర్ మిడిల్ ఆర్డర్‌కు శాపంగా మారింది. 37 ఏళ్ల రహానేకు ఇది కెప్టెన్‌గానే కాదు, ఒక ఆటగాడిగా కూడా ఐపీఎల్లో చివరి సీజన్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోతే ఎంతటి దిగ్గజాలైనా పక్కన పెట్టడం ఖాయమనేది ఐపీఎల్ తో చాలాసార్లు రుజువైంది.