బుమ్రా వచ్చాడు కానీ కండిషన్స్ అప్లై.. లంక టూర్ కు భారత జట్టు ఎంపిక..!

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును  ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

Post Published By: dialnews
Updated : 29 July 2026, 6:50 PM IST

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును  ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే దేశీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కింది.గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ సారాంశ్ జైన్‌ను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్ తరపున 131 ఫస్ట్-క్లాస్ వికెట్లు సాధించిన జైన్, ఇటీవల శ్రీలంక ఎ జట్టుపై ఇండియా ఎ తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.బుమ్రా మోకాలి గాయం, వాషింగ్టన్ సుందర్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. సుందర్ అందుబాటులో ఉండడనీ బీసీసీఐ తెలిపింది. అయితే బుమ్రా ఫిట్ నెస్ సాధిస్తే తుది జట్టులో చోటు దక్కించుకుంటాడనీ తెలిపింది. నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణాలను గాయాల వల్ల ఈ సిరీస్‌కు పక్కనపెట్టారు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ సిరీస్ భారత్ కు కీలకం కావడంతో బలమైన జట్టునే ఎంపిక చేశారు.

శుభ్‌మన్ గిల్,  జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో యువ, అనుభవజ్ఞులైన బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. శ్రీలంక పిచ్‌లకు తగినట్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి సెలెక్టర్లు మొండి చెయ్యే చూపించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23న కొలంబోలో మొదలవ్వనుంది. ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు ఆగస్టు 7వ తేదీ నుంచి కొలంబోలో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

Published : 
  • 29 July 2026, 6:50 PM IST