ధోనీని అలా కెప్టెన్సీ నుంచి తప్పించాం… అసలు సంగతి చెప్పిన మాజీ సెలక్టర్…!

టీమిండియా క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్, కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 4:48 PM IST

టీమిండియా క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్, కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది. ఎంఎస్ ధోనీ స్వచ్ఛందంగా తప్పుకున్నారని అందరూ భావించినప్పటికీ.. దాని వెనుక బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒత్తిడి ఉందనే సంచలన విషయాలను మాజీ సెలెక్టర్ జతిన్ పరంజపే వెల్లడించారు. 2017లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే ప్రక్రియ ఎలా జరిగిందో జతిన్ పరంజపే వివరించారు. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కలిసి తాను ధోనీని కలిసినట్లు ఆయన తెలిపారు.అతనికి ఎంత గౌరవపూర్వకంగా చెప్పాలనే దానిపై తామిద్దరం ముందుగానే చర్చించుకున్నామన్నారు. ప్రాక్టీస్ పూర్తయ్యాక ధోనీ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పామన్నారు.

తమ మాటలకు ధోనీ ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకపోగా మీకేం కావాలో చెప్పండని ధోనీ బదులిచ్చాడనీ గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరగా.. ధోనీ అంగీకరించాడనీ తెలిపారు. ఆ రోజు అర్ధరాత్రి సెలక్షన్ కమిటీకి ధోనీ నుంచి ఈమెయిల్ వచ్చినట్లు జతిన్ పరంజపే వెల్లడించారు. కెప్టెన్సీ పోతున్నా ధోనీలో ఏమాత్రం అహంకారం కనిపించలేదని సెలెక్టర్లు కొనియాడారు. విరాట్ తనకు తమ్ముడి లాంటి వాడనీ, అతనితో కలిసి నేను పూర్తిస్థాయిలో పని చేస్తాననీ సెలక్టర్లతో ధోనీ చెప్పిన విషయాన్ని పరంజపే వెల్లడించారు.

తామంతా కలిసి ఒక గొప్ప జట్టును నిర్మిస్తామనీ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. చెప్పినట్లుగానే ధోనీ తన కెరీర్ చివరి వరకు విరాట్ కోహ్లీకి మార్గదర్శకుడిగా ఉంటూ మైదానంలో కీలక సూచనలు చేస్తూనే ఉన్నారు.ఈ నిర్ణయం తీసుకున్నందుకు అప్పట్లో సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వచ్చాయని.. కానీ జట్టు భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని జతిన్ పరంజపే చెప్పుకొచ్చారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. 35 ఏళ్ల వయసులో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీ శకానికి నాంది పలికారు.

Published : 
  • 16 February 2026, 4:48 PM IST