ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి, చివరి మెట్టుపై బోల్తా పడ్డ పంజాబ్ కింగ్స్ .. ఐపీఎల్ 2026లోనూ మంచి ఆరంభం అందుకుంది. తొలి అర్ధభాగంలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఏడు మ్యాచ్‌లు ముగిసే సరికి 13 పాయింట్లతో టాప్ ప్లేసులో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలుపు రుచి చూడలేకపోయింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోనూ పరాజయం పాలైంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్యుజ్వేంద్ర చాహల్‌కు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఇవ్వకపోవడంపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు వచ్చాయి.
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అతడు బౌలింగ్ చేసి ఉంటే.. కచ్చితంగా ప్రభావం చూపేవాడని ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు స్పిన్నర్లను వాడుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. 2023 నుంచి ఈ గ్రౌండ్‌పై పేసర్ల కంటే కూడా స్పిన్నర్లకే మంచి ఎకానమీ ఉందని గణాంకాలు చెబుతున్నాయనీ గుర్తు చేశాడు.. కానీ సోమవారం మ్యాచ్‌లో అక్షర్ పటేల్, చాహల్ బౌలింగ్ చేయకపోవడం చూసాక ఏం జరుగుతుందో అర్థం కాలేదని కైఫ్ వ్యాఖ్యానించాడు.
మోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇలాంటి తప్పిదాలతోనే పంజాబ్ ఓడిపోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చాహల్ కు బౌలింగ్ ఇవ్వకపోవడంపై వస్తున్న విమర్శలకు శ్రేయాస్ స్పందించాడు. అప్పుడు పిచ్ పేసర్లకే అనుకూలంగా ఉందని అనిపించడంతో వారినే కొనసాగించానని వివరణ ఇచ్చాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడినా.. ఆ తర్వాత పుంజుకుంది. కేవలం 19 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది.