టీమిండియా టీ20 స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌కు ఐపీఎల్‌లో ప్రమోషన్ దక్కింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువక్రికెటర్‌ను ఆ ఫ్రాంచైజీ వైస్ కెప్టెన్‌గా నియమించింది. 19వ సీజన్‌లో అజింక రహానేకు రింకూ డిప్యూటీగా వ్యవహరించనున్నా డు.
దీనికి సంబంధించి కేకేఆర్ ఎండీ వెంకీ మైసూర్ అధికారిక ప్రకటన చేశారు. ఐపీఎల్-2024లో కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే, మెగా వేలం-2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది.
గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్‌గా కొనసాగించనుంది.ఈ సీజన్ కు నిజానికి రింకూకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకూ చుట్టు జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే, తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకోవడంతో కేకేఆర్ భవిష్య కెప్టెన్ రింకూనే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.
కాగా 2018 నుంచి రింకూ సింగ్ కేకేఆర్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్‌లలో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫునా ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూది పేద కుటుంబం. అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్‌గా ఎదిగాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది లైమ్‌లైట్‌లోకి వచ్చిన రింకూ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్ రింకూను 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, అతడి విజయాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించకుండానే.. ముఖ్యంగా టెస్టుల్లో రింకూ ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవలే మరణించాడు.