టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలు ముంబై ఇండియన్స్‌లో ఇక ముగిసినట్టే కనిపిస్తోంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా చేసి తొలి ఏడాదే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పాండ్యా.. ఆ తర్వాత ఏడాది ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. దాంతో భారీ ట్రేడ్‌తో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చిన పాండ్యా కెప్టెన్‌గా వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించే పొజిషన్‌కు వచ్చాడు.ముంబై ఇండియన్స్‌తో కెరీర్ పీక్స్‌లోకి వెళ్లిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు అదే ముంబై ఇండియన్స్‌లో ఆడుతూ దిగజారిపోయాడు. ఐపీఎల్ 2021 వరకూ ముంబై ఇండియన్స్‌లో కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగిన పాండ్యా.. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిపోయాడు. అదే ఏడాది ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ అందించాడు.
ఐపీఎల్ 2023లో కూడా దాదాపు టైటిల్ గెలిచినంత పనిచేసి ఆఖరి బంతికి ఓటమిని ఎదుర్కోవడంతో రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది.ఐపీఎల్ 2024లో తిరిగి ముంబై ఇండియన్స్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన మేనేజ్మెంట్ ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకి అప్పగించింది. వరుసగా రెండేళ్ల పాటు కెప్టెన్సీలో సక్సెస్ అయిన హార్దిక్.. ముంబై ఇండియన్స్‌కి తిరిగి రాగానే విఫలమయ్యాడు.ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్‌కి వెళ్లిన ముంబై ఇండియన్స్ .. ఐపీఎల్ 2024లో దారుణంగా పతనమైంది. ఆ సీజన్లో కేవలం నాలుగంటే నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానానికి పడిపోయింది. ఐపీఎల్ 2025లో ఆరంభంలో ఓడిపోయి, ఆ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ వరకూ వెళ్లింది. ఎలిమినేటర్‌లో గుజరాత్‌ని ఓడించి, క్వాలిఫైయర్ 2లో పంజాబ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
ఇక ఐపీఎల్ 2026లో ముంబై బలమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ విజయం సాధించడానికి ఆపసోపాలు పడింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగంటే నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 4 మ్యాచ్‌లే గెలిచినప్పటికీ రన్‌రేట్ ముంబై కన్నా దిగువన ఉండటంతో పదో స్థానానికి వెళ్లిపోయింది.సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్ల మధ్య సత్సంబంధాలు దెబ్బతినడమే ముంబై ఇండియన్స్ వైఫల్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్ అందించిన డేటా, వ్యూహాలను ప్లేయర్లు మైదానంలో అమలు చేయకపోవడంపై ముంబై యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది.హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న మూడేళ్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు పాయింట్ల పట్టిక దిగువ స్థానానికి పడిపోయింది. ఒకే ఒక్క ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరింది. వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై విఫలమవ్వడంతో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలన్న ఆలోచనలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.హార్దిక్ పాండ్యాకు ముంబై ఫ్యాన్స్ నుంచి మొదటి నుంచే ఆశించిన మద్దతు లభించలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 2024లో జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది, 2025లో కొంత మెరుగైనప్పటికీ, 2026 సీజన్ మళ్లీ తీవ్ర నిరాశను మిగిల్చింది.