Top story: రాహుల్ ద్రావిడ్‌కు ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ ఆఫర్? క్రికెట్ ప్రపంచంలో భారీ ప్రకంపనలు..!

భారత క్రికెట్‌ను ప్రపంచ విజేతగా నిలిపి, టీమిండియా హెడ్ కోచ్‌గా రిటైర్ అయిన 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మళ్లీ మారుమోగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు

Post Published By: dialnews
Updated : 14 July 2026, 9:15 PM IST

భారత క్రికెట్‌ను ప్రపంచ విజేతగా నిలిపి, టీమిండియా హెడ్ కోచ్‌గా రిటైర్ అయిన 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మళ్లీ మారుమోగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్‌గా మన రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొన్నటివరకు ఇంగ్లండ్‌ను బజ్‌బాల్ ఆటతీరుతో నడిపించిన బ్రెండన్ మెక్‌కలమ్‌ను ఆ బాధ్యతల నుంచి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తప్పించింది.ఆ ఖాళీ అయిన స్థానంలో ద్రావిడ్‌ను నియమించడానికి ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు మెక్‌కలమ్‌ను ఎందుకు తీసేశారు? ద్రావిడ్ పేరు తెరపైకి ఎలా వచ్చింది? ఇంగ్లండ్ ఆఫర్‌కు ద్రావిడ్ ఒప్పుకుంటారా లేదా?

గత కొంతకాలంగా ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. బ్రెండన్ మెక్‌కలమ్ కోచ్‌గా వచ్చిన కొత్తలో 'బజ్‌బాల్'.. అంటే టెస్టుల్లోనూ వన్డే తరహాలో ఆడటం అనే సరికొత్త ఫార్ములాతో కొన్ని విజయాలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆ జట్టు ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కోల్పోవడంతో ఈసీబీ తీవ్ర అసంతృప్తికి లోనైంది. వచ్చే ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక 'యాషెస్ సిరీస్'ను దృష్టిలో ఉంచుకుని, టెస్ట్ జట్టులో మార్పులు చేయడానికి ఇదే సరైన సమయమని భావించిన బోర్డు, మెక్‌కలమ్‌ను టెస్ట్ కోచ్ బాధ్యతల నుండి తప్పించింది.

అయితే అతను వన్డే, టీ20 జట్లకు మాత్రం హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని ఇంగ్లండ్ బోర్డు స్పష్టం చేసింది. మెక్‌కలమ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సిద్ధం చేసిన షార్ట్‌లిస్ట్‌లో రాహుల్ ద్రావిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'డైలీ టెలిగ్రాఫ్' కథనం ప్రకారం.. ద్రావిడ్ కు ఉన్న అపారమైన అనుభవం, ప్రణాళికాబద్ధమైన కోచింగ్ శైలి ఇంగ్లండ్ బోర్డును బాగా ఆకర్షించాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్ ఎంతటి అద్భుతాలు సృష్టించాడో మనందరికీ తెలిసిందే.

భారత్‌ను 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చడంతో పాటు, 2024లో టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలపడంలో ద్రావిడ్ వ్యూహాలు ఎంతో కీలకంగా పనిచేశాయి. కేవలం సీనియర్ జట్టునే కాకుండా, భారత్ అండర్-19 మరియు ఇండియా-ఎ జట్లను కూడా నడిపి యువ ఆటగాళ్లను తయారు చేసిన ట్రాక్ రికార్డ్ ద్రావిడ్‌కు ఉంది. అందుకే ఇంగ్లండ్ జట్టును మళ్లీ గాడిన పెట్టడానికి ద్రావిడ్ అయితేనే పర్‌ఫెక్ట్ అని ఈసీబీ భావిస్తోంది. ఇంగ్లండ్ బోర్డు ఎంత ఆశపడుతున్నా.. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ నెలకుంది.

రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం పూర్తిస్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని సదరు నివేదికలు చెబుతున్నాయి. టీమిండియా కోచ్‌గా ఉన్నప్పుడు నిరంతర ప్రయాణాలు, కుటుంబానికి దూరంగా ఉండటం వల్లే అతను ఆ పదవి నుండి తప్పుకున్నారు. అయితే, ఇంగ్లండ్ ఆఫర్ చేస్తున్నది కేవలం 'టెస్ట్ జట్టు' కోచింగ్ మాత్రమే. దీనివల్ల సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ప్రయాణాలు ఉంటాయి, మిగిలిన సమయం ఇంట్లోనే గడపవచ్చు. పైగా టెస్ట్ క్రికెట్ అంటే ద్రావిడ్‌కు ప్రాణం కాబట్టి, ఈ ఆఫర్‌ను అతను అంగీకరించే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది.ఒకవేళ ద్రావిడ్ కాకపోతే రేసులో జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్, రిచర్డ్ డాసన్, కుమార సంగక్కర మరియు ఆండ్రూ ఫ్లింటాఫ్ లాంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. ఏది ఏమైనా టీమిండియాకు చారిత్రాత్మక విజయాలు అందించిన మన రాహుల్ ద్రావిడ్‌ను, ఇంగ్లండ్ లాంటి అగ్రశ్రేణి జట్టు తమ కోచ్‌గా నియమించుకోవాలని చూడటం భారత క్రికెట్ అభిమానులందరికీ గర్వకారణం.

Published : 
  • 14 July 2026, 9:15 PM IST