రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్మకం తుది దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ కూడా విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్లో అత్యంత ఆకర్షణ ఉన్న జట్లలో రాజస్థాన్ కూడా ఒకటి. ఈ లీగ్ తొలి సీజన్లో కప్పు గెలిచిన ఆర్ఆర్.. ఆ తర్వాత 17 సీజన్లుగా రెండోసారి విజేతగా నిలువకపోయినా రాజస్థాన్‌కు అభిమానుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. 2022లో ఫైనల్ చేరిన ఆ జట్టులో సమష్టితత్వం ఎక్కువ. స్టార్లతో సంబంధం లేకుండా విజయాలు సాధించే రాయల్స్ నుంచి ఇటీవలే ఆ జట్టుకు చాలాకాలంగా ఆడుతున్న సంజూ శాంసన్ గుడ్ బై చెప్పినా ఆర్ఆర్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం యాజమాన్యంలో ఎమర్జింగ్ మీడియా ఐపీఎల్ లిమిటెడ్ గ్రూప్ ఓనర్ మనోజ్ బదాలెకు 65 శాతం వాటా ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్కు 15 శాతం, లచ్లాన్ ముర్దోచ్కు 13 శాతం వాటా ఉంది.ఇటీవల కాలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరిగాయి. ఈ కారణంగా పెద్ద వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు ఐపీఎల్ జట్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలుకు బిడ్లు వేయడానికి సిద్ధమవుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఆ టీమ్ మెజారిటీ వాటాదారుడైన మనోజ్ బదలే తన వాటాను పూర్తిగా విక్రయించాలని చూస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ విలువ సుమారు రూ. 9,100 కోట్లు ఉండగా.. బిడ్డింగ్‌లో రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ టీమ్ కోసం దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు ప్రముఖ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, భారత మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన క్యాప్రీ గ్లోబల్ రేసులో ఉన్నట్టు సమాచారం. ఈ సంస్థలు ఇప్పటికే బిడ్లు కూడా దాఖలుచేశాయని వ్యాపారవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే రాజస్థాన్ రాయల్స్ విక్రయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.