భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు ఎంతో ఇష్టమైన ఫార్మాట్ నుంచి హఠాత్తుగా తప్పుకోవడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే కోహ్లీ రెడ్ బాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని ప్రచారం జరిగింది. కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. దాంతో సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని విరాట్ కోహ్లీని పలువురు మాజీ క్రికెటర్లు అభిమానులు కోరారు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫిట్నెస్తో మరో 3 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా టెస్టుల్లోకి కోహ్లీ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అది ముగిసిన కథ అని తేల్చేసాడు. టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు.తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీని ఇదే విషయంపై ప్రశ్నించగా రీఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ బ్రాండ్‌లోని ఓ షూ ధర విరాట్ కోహ్లీ చేసిన టెస్ట్ పరుగులతో సమానంగా ఉంది.ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా కమెడియన్ డానిష్ సైత్.. సరదాగా ఓ ప్రశ్న వేసాడు. 'టెస్ట్‌ల్లో ఇంకొన్ని పరుగులు చేసి..ఆ షూ లాభాలను పెంచొచ్చు కదా అంటూ విరాట్ కోహ్లీని అడిగాడు.
తాను తక్కువ ధరకు అమ్మడానికే ఇష్టపడతానననీ,.మీరు అడుగుతున్న దానితో తన పని అయిపోయిందని కోహ్లీ బదులిచ్చాడు. దాంతో టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ఆసక్తి తనకు లేదని విరాట్ కోహ్లీ తేల్చేసాడు.ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తన జీవితం ఢిల్లీలోనే మొదలైందనీ, ఇక్కడే పుట్టి ఇక్కడే క్రికెటర్‌గా ఎదిగానని చెప్పాడు. అందుకే ఢిల్లీలో వన్8 బ్రాండ్‌ను ప్రారంభించాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చాడు.అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే ఈ స్థాయికి చేరుకున్నానంటూ విరాట్ వ్యాఖ్యానించాడు. తన 14 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 9,230 పరుగులు సాధించాడు. దీనిలో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.