తండ్రి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న రింకూ సింగ్ దేశం కోసం మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి ఖాంచంద్ సింగ్ అంత్యక్రియలు పూర్తి చేసిన కొన్ని గంటలకే రింకూ కోల్‌కతాకు చేరుకోవడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. భారత్- వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగే కీలక టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం రింకూ శనివారం ఉదయం కోల్‌కతా చేరాడు. ఈ మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డైగా మారిన నేపథ్యంలో, అతని చేరిక జట్టుకు పెద్ద బలం కానుంది.రింకూ చెన్నై నుంచి ఉదయం 5 గంటలకు ఢిల్లీ వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. క్యాన్సర్ బారిన పడిన రింకూ తండ్రి ఖాంచంద్ సింగ్ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పరిస్థితి మరింత విషమించింది.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ సమయంలో రింకూ జట్టులో ఉన్నప్పటికీ, తుది జట్టులో అవకాశం దక్కలేదు. దాంతో రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి దిగాడు. ఆ మ్యాచ్ ముగిసిన తెల్లవారుజామునే రింకూ సింగ్ తండ్రి మరణించినట్లు వార్త అందింది. దాంతో శుక్రవారం సాయంత్రం అలీగఢ్‌లో తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.తీవ్ర విషాదంలో రింకూ మునిగిపోవడంతో ఈ టీ20 వరల్డ్‌కప్ మిగతా మ్యాచ్‌లకు రింకూ అందుబాటులో ఉండడని అందరూ అనుకున్నారు. కానీ శనివారం ఉదయం కోల్‌కతా విమానాశ్రయంలో రింకూ కనిపించాడు.
అతడు ఐపీఎల్లో ఆడే హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరగనుండటంతో, అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్యాస్ సిలిండర్లు వేస్తూ తన కుమారుడి కలను నెరవేర్చిన తండ్రికే తన విజయాలన్నీ అంకితం చేస్తున్నానని రింకూ గతంలో పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు అదే తండ్రిని కోల్పోయినా, దేశం కోసం మైదానంలోకి దిగేందుకు సిద్ధమవడం అతడి నిబద్ధతకు నిదర్శనం. భారత్‌కు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో రింకూ మళ్లీ జట్టులోకి వస్తాడా అతడి బ్యాట్ మళ్లీ పరుగులు కురిపిస్తుందా అన్నది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.