వరల్డ్ కప్ కు స్కాట్లాండ్ రెడీ… మెగా టోర్నీకి జట్టు ప్రకటన
టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌కు ఊహించని అవకాశమొచ్చింది. అయితే ఈ పరిణామంపై క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్
టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్‌కు ఊహించని అవకాశమొచ్చింది. అయితే ఈ పరిణామంపై క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రుడీ లిండే స్పందిస్తూ బంగ్లాదేశ్ జట్టుపై తన సానుభూతిని వ్యక్తం చేశారు. భారతదేశంలో జరగాల్సిన మ్యాచ్‌ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి వైదొలగింది. దాంతో ఐసీసీ నిర్ణయంతో స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా టోర్నీలోకి తీసుకున్నారు.వరల్డ్ కప్‌కు ఇలా రావాలని తాము ఎప్పుడూ కోరుకోలేదన్నారు. క్వాలిఫికేషన్ అనే ప్రక్రియ ఉంటుందనీ ,మరో జట్టు తప్పుకోవడం వల్ల ఇలా అవకాశం రావడం చాలా ప్రత్యేక పరిస్థితిగా చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ ఆటగాళ్ల పరిస్థితి తమకు అర్థమవుతుందని ట్రుడీ పేర్కొన్నారు.
యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న స్కాట్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్ కంటే వెనుకబడడంతో నేరుగా అర్హత సాధించలేకపోయింది. అయినా, అత్యధిక ర్యాంక్ ఉన్న జట్టుగా ఉండటంతో ఐసీసీ స్కాట్లాండ్‌ను టోర్నీలోకి ఎంపిక చేసింది. మొదటగా టీ20 వరల్డ్ కప్ 2026కు అర్హత సాధించిన బంగ్లాదేశ్, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ స్వతంత్ర భద్రతా పరిశీలనలు చేపట్టి, భారత్‌లో ఎలాంటి నమ్మదగిన భద్రతా ముప్పు లేదని తేల్చింది. మూడు వారాల పాటు చర్చలు సాగినా, షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని ఐసీసీ తేల్చిచెప్పింది.
నిర్దిష్ట గడువులో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ అంగీకారం తెలపకపోవడంతో, ఐసీసీ తన నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేసింది. దాంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పించగా, స్కాట్లాండ్‌కు చోటు దక్కింది. టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ సీలో ఉన్న స్కాట్లాండ్ టీమ్ ఇంగ్లండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్ జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో కోల్‌కతాలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో అదే వేదికపై పోటీ పడుతుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‌తో ఆడనుంది.
ఇప్పటివరకు ఐదు సార్లు టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొన్న స్కాట్లాండ్ గత రెండు ఎడిషన్లలోనూ సూపర్-8కు చేరలేకపోయింది. అయినా అగ్ర జట్లను గట్టిగా ఢీకొట్టిన అనుభవం ఉంది. 2024 టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు గట్టి పోటీ ఇచ్చి ప్రశంసలు అందుకుంది. మరి ఈ ఏడాది ఏ జట్టుకు స్కాట్లాండ్ షాక్ ఇస్తుందో చూడాలి.











