పేరు మారింది.. సుడిగాలి టు సుధీర్ ఆనంద్.. వివాదాల సుడిగుండంలో గోట్.. గట్టెక్కేనా..?
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ గా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న సుధీర్.. ఇప్పుడు వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు.
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ గా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న సుధీర్.. ఇప్పుడు వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగానే తన పేరు ముందున్న సుడిగాలి అనే ట్యాగ్‌ను తొలగించుకుని.. సుధీర్ ఆనంద్ గా కొత్త అవతారం ఎత్తాడు. కేవలం కమెడియన్‌గానే కాకుండా ఒక మాస్ హీరోగా తనను తాను నిరూపించుకోవాలనే తపనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా విడుదలైన గోట్ సినిమా సాంగ్ లో కూడా ఆయన పేరును సుధీర్ ఆనంద్ అనే వేయడం ఈ మార్పుకు బలమైన నిదర్శనం. జబర్దస్త్ ఇమేజ్ నుంచి బయటపడి.. పూర్తి స్థాయి హీరోగా స్థిరపడాలనేది సుధీర్ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. చాలా కాలం పాటు స్తబ్దుగా ఉన్న గోట్ సినిమా నుంచి ఎట్టకేలకు ఒక మాస్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పాట విడుదలైంది కానీ సినిమా విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందా లేక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరుగుతుందా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఈ సాంగ్ రిలీజ్‌తో సినిమా ఇంకా రేసులోనే ఉందని.. త్వరలోనే థియేటర్లలోకి వస్తుందని చిత్ర యూనిట్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రయాణం ఆరంభం నుంచి పూల పాన్పులా సాగలేదు. మధ్యలో ఈ సినిమాపై హీరోయిన్ దివ్య భారతి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి. తన పట్ల దర్శకుడు ప్రవర్తించిన తీరు బాగోలేదని, సెట్స్‌లో తాను ఏడుస్తున్నా కూడా సుధీర్ ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయాడని ఆమె చేసిన ఆరోపణలు సుధీర్ ఇమేజ్‌పై కాస్త ప్రభావం చూపాయి.
సుధీర్ లాంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో స్పందించకపోవడం తనను బాధించిందని ఆమె ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ వివాదం కారణంగా సినిమా షూటింగ్ కూడా కొన్నాళ్లు ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదాల నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. మొదట ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకుడిగా ఉండగా.. ఇప్పుడు విడుదలైన పోస్టర్లలో మాత్రం దర్శకుడిగా పాగల్ ఫేమ్ వేదవ్యాస్ పేరు కనిపిస్తోంది. నరేష్ కుప్పిలిపై హీరోయిన్ చేసిన ఆరోపణల వల్లే దర్శకుడిని మార్చారా? లేక క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమైనా వచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది. కానీ దర్శకుడి మార్పుతో సినిమాను మళ్లీ గాడిలో పెట్టి, ఫ్రెష్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
పాత వివాదాలను పక్కనబెట్టి సినిమాను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఇప్పుడు వేదవ్యాస్ భుజాన వేసుకున్నాడు. మొత్తానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. సుధీర్ ఆనంద్ మాత్రం గోట్ సినిమాతో గట్టిగానే కొట్టాలని చూస్తున్నాడు. టైటిల్‌లో ఉన్న గోట్ అనే కాన్ఫిడెన్స్ సినిమా ఫలితంలో కూడా కనిపిస్తుందా అనేది చూడాలి. పేరు మార్పు, దర్శకుడి మార్పు, హీరోయిన్ వివాదాలు.. ఇవన్నీ దాటుకుని సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా..? సుధీర్ ఆనంద్ అనే కొత్త పేరు అతనికి ఏమేరకు కలిసొస్తుంది? అనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే పాటతో సందడి మొదలైంది కాబట్టి.. త్వరలోనే విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











