టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. నమీబియాతో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టులో ఆందోళన నెలకొంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోలేదు. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ పాల్గొనకపోవడంతో నమీబియా మ్యాచ్‌లో ఆయన ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి.మంగళవారం సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన శిక్షణా శిబిరానికి జట్టు సభ్యులంతా హాజరైనప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం కనిపించలేదు. ఆయన ఇంకా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని కోచింగ్ స్టాఫ్ ధ్రువీకరించారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ అనారోగ్యంతో బరిలోకి దిగాడు. కానీ పరిస్థితి విషమించడంతో ఫీల్డింగ్‌కు రాలేకపోయారు.
అభిషేక్ శర్మ అందుబాటులో లేని పక్షంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్స్‌లో సంజూ శాంసన్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అయితే ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్‌లో సంజూ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. ఇషాన్ కిషన్ నెట్స్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. శివమ్ దూబే, హార్దిక్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.మరోవైపు జ్వరంతో తొలి మ్యాచ్ ఆడని జస్ప్రీత్ బుమ్రా.. రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అభిషేక్ శర్మ ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని బ్యాటింగ్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే మీడియాకు తెలిపాడు. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉందని, ఆ సమయానికి కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పాడు. అయినా టోర్నీ సుదీర్ఘమైనది కాబట్టి, తాము తొందరపడదలచుకోలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ నాటికి అభిషేక్‌ను పూర్తి ఫిట్నెస్తో ఉంచడమే టీమ్ మేనేజ్మెంట్ లక్ష్యంగా కనిపిస్తోంది.ఇటీవల జట్టులో చేరిన వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొన్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా నెట్స్‌లో అదనపు సమయం ప్రాక్టీస్ చేశారు.అమెరికాతో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమవగా.. సూర్యకుమార్ యాదవ్ అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకొని జట్టును గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆట తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలోనే నమీబియాతో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా భావిస్తోంది.