ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువకుడు గిరి ప్రసాద్‌కు గాయమైంది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ బలమైన షాట్ కొట్టాడు. అదే సమయంలో షాట్ నెట్స్ వద్ద ఉన్న గిరి ప్రసాద్ ముఖానికి బలంగా తాకింది. ఫలితంగా తీవ్రంగా గాయపడ్డ గిరి ప్రసాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించింది. తాజాగా అతడికి స్టొయినిస్ సారీ చెప్పాడు.ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ కింగ్స్ మ్యాచ్ పూర్తయిన తర్వాత మార్కస్ స్టాయినీస్ నెట్ బౌలర్ గిరి ప్రసాద్‌ను పరామర్శించాడు.
హాస్పిటల్‌కు వెళ్లి తాను పొరపాటున షాట్ ఆడానని, క్షమించాలని కూడా స్టాయినీస్ కోరాడు. అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నాడు. అతడిలో సెల్ఫీ దిగి, క్యాప్‌పై కూడా తన సంతకం చేసి గిఫ్ట్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు తాము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాడు.కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గిరి ప్రసాద్ గత సీజన్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నాడు.
మార్కస్ స్టాయినీస్ ఢిల్లీ నెట్ బౌలర్‌ను పరామర్శించిన పోస్టును పంజాబ్ కింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో మార్కస్ స్టాయినీస్ మంచి మనస్సును పొగుడుతూ నెటిజన్లు ప్రశంసలు అందించారు. యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తామని, తమ ఆటగాళ్ల విషయంతో బాధ్యతగా వ్యవహరిస్తామంటూ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ తెలియజేశాడు. ఆంధ్రలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన యువ క్రికెటర్ కోసం రెండు జట్లు ఇలా స్పందించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇక తాజాగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో గిరిప్రసాద్ చోటు దక్కించుకున్నాడు. కాకినాడ కింగ్స్ గిరిని సొంతం చేసుకుంది.