టీమిండియాకు గాయాల బెడద.. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కు ఇబ్బందులు.!

2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలకు భారత ఆటగాళ్ల వరుస గాయాలు తలనొప్పిగా మారాయి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వన్డే ఓటమి అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టును వేధిస్తున్న ఈ ఫిట్‌నెస్ సమస్యలపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

Post Published By: dialnews
Updated : 23 July 2026, 4:50 PM IST

2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలకు భారత ఆటగాళ్ల వరుస గాయాలు తలనొప్పిగా మారాయి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వన్డే ఓటమి అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టును వేధిస్తున్న ఈ ఫిట్‌నెస్ సమస్యలపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మొదట ప్రకటించిన జట్టు నుంచి కనీసం ఐదుగురు ఆటగాళ్లు గాయాల వల్ల ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యారని వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వంటి కీలక ఆటగాళ్లు పదే పదే గాయాల పాలుకావడం భారత్‌కు ఆందోళనకరంగా మారింది. సాధారణంగా ఎంతో ప్రశాంతంగా ఉండే గిల్, ఇంగ్లాండ్ చేతిలో లార్డ్స్‌లో ఓటమి తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఇదే విషయంపై తీవ్ర అసహనాన్ని గురయ్యాడు. ఈ ఓటములకు జట్టు ఆడిన విధానం కంటే, నిరంతరం ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.

2027 వన్డే ప్రపంచకప్‌కు బలమైన జట్టును తయారు చేయాలని చూస్తున్న భారత మేనేజ్‌మెంట్‌కు ఆటగాళ్ల గాయాలు తలనొప్పిగా మారాయి.వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అత్యంత కీలకమైన పేస్ ఆల్‌రౌండర్ల విభాగాన్ని గాయాలు దారుణంగా దెబ్బతీశాయి. కీలక ఆటగాళ్లయిన హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నారు. నితీష్ రెడ్డి క్వాడ్రిసెప్ గాయంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు దూరం కాగా, హార్దిక్ మార్చి 2025 తర్వాత వన్డే ఆడలేదు. ఎనిమిదో స్థానం కోసం చూస్తున్న హర్షిత్ రాణా తొడకండరాల గాయంతో కోలుకుంటున్నాడు. వీటికి తోడు ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. గాయంతో లార్డ్స్ మ్యాచుకు దూరమయ్యాడు. దీంతో అనుభవం లేని గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లతో ఆడాల్సి వచ్చిందని గిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

స్పిన్ విభాగంలోనూ ఇదే తరహా నిరాశజనక పరిస్థితి నెలకొంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొడకండరాల గాయంతో శ్రీలంక టెస్టులకు అనుమానంగా మారగా, వరుణ్ చక్రవర్తి హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో జింబాబ్వే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రపంచకప్‌లో విజేతగా నిలవాలంటే వరుసగా 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని, చిన్న సిరీస్‌లలో రెండు మ్యాచ్‌లు ఆడగానే ఆటగాళ్లు గాయపడితే ఎలా అని గిల్ వ్యాఖ్యానించాడు. ప్లేయర్లు ఒకట్రెండు మ్యాచ్‌లు ఆడి గాయపడితే అనుకోని కాంబినేషన్లతో బరిలోకి దిగాల్సి వస్తోందని చెప్పుకొచ్చాడు. గిల్ వ్యాఖ్యలతో పలువురు మాజీలు, విశ్లేషకులు ఏకీభవిస్తున్నారు. గాయాలు జట్టు కూర్పును దెబ్బతీస్తున్నాయని.. ఈ విషయంలో ఆటగాళ్లు మరింత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.

Published : 
  • 23 July 2026, 4:50 PM IST