ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదురైన చేదు పరాజయాల తర్వాత, భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తనస్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. జింబాబ్వేతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు విలేకరులతో మాట్లాడిన ఈ హైదరాబాదీ క్రికెటర్ తాను స్వార్థంతో కాకుండా జట్టు పరిస్థితికి తగ్గట్టుగానే బ్యాటింగ్ చేస్తానని స్పష్టం చేశాడు.విదేశీ గడ్డపై వరుస సిరీస్ ఓటముల తర్వాత భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మైదానంలో నెమ్మదిగా పరుగులు రాబడుతున్నారన్న ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించాడు. విదేశీ మైదానాల్లో వికెట్లు పడుతున్నప్పుడు జట్టును నిలబెట్టడం తన బాధ్యతగా చెప్పాడు.
మొదటి బంతి నుంచే విరుచుకుపడే సత్తా తనకుందనీ, కానీ, ఆరంభంలోనే నాలుగైదు వికెట్లు కోల్పోయినప్పుడు బాధ్యతారాహిత్యంగా భారీ షాట్లకు వెళ్లి వికెట్ పారేసుకోవడం సరికాదన్నాడు. జట్టు మేనేజ్మెంట్ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చే క్రమంలోనే పరిస్థితిని బట్టి ఆడుతున్నానని తిలక్ వర్మ స్పష్టం చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అభిమానుల నుంచి భారీ అంచనాలు ఉంటాయని చెప్పాడు. ఇదే సమయంలో జట్టు యాజమాన్యం నుంచి బాధ్యతలు ఉంటాయని తెలిపాడు. ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో వాతావరణం, పిచ్ పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉన్నాయని తిలక్ అభిప్రాయపడ్డాడు.గత రెండేళ్లలో అంటే టీ20 ప్రపంచకప్ 2024 జరిగిన తర్వాత, భారత జట్టు ఆడిన మ్యాచ్‌లలో మెజారిటీ ఆసియా ఖండంలోనే జరిగాయి.
ఈ పరిస్థితుల్లో స్వదేశీ పిచ్‌లతో పాటు ఉపఖండంలోని అనుకూలమైన మైదానాల్లో ఎక్కువగా ఆడిన తర్వాత, నేరుగా విదేశీ పరిస్థితులకు మారి అక్కడ ఆడటం సవాల్‌తో కూడుకున్న విషయమని తిలక్ వర్మ అన్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లో బంతి అనూహ్యంగా స్వింగ్ అవ్వడం, సీమ్ కావడం వల్ల బ్యాటర్లు తమ శైలిని మార్చుకోవాల్సి వస్తుందని అతడు వెల్లడించాడు.ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న తిలక్ వర్మ మళ్లీ పాత ఫామ్‌ను అందుకోవాలని చూస్తున్నాడు. విదేశీ పర్యటనలలో ఎదురైన ఓటములు, కష్టమైన పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని.. మెరుగ్గా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఐర్లాండ్ , ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ లకు గురైన భారత్ ఇప్పుడు జింబాబ్వేతో టీ20 సిరీస్ కు రెడీ అయింది.