ఆడకపోతే రూ.348 కోట్లు కట్టండి… పాక్ బోర్డుకు బ్రాడ్‌కాస్టర్ల వార్నింగ్…!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే విషయమై దాయదీ పాకిస్థాన్ నాటకం ఆడుతోంది. టోర్నీ‌లో పాల్గొనమని, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని మీడియాకు లీకులు ఇస్తూ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2026 | 10:00 PMLast Updated on: Jan 28, 2026 | 10:00 PM

Pay Rs 348 Crore If You Dont Play Broadcasters Issue A Warning To The Pakistan Board

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే విషయమై దాయదీ పాకిస్థాన్ నాటకం ఆడుతోంది. టోర్నీ‌లో పాల్గొనమని, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని మీడియాకు లీకులు ఇస్తూ. ఐసీసీని బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 ఆడకుండా బంగ్లాదేశ్‌ను ఉసిగొల్పిన పాకిస్థాన్.. ఆఖరికి ఆ జట్టును ఆగం చేసింది. తాము అండగా ఉంటామని చెప్పి సైడ్ అయ్యింది. పాకిస్థాన్‌ను నమ్ముకొని బంగ్లాదేశ్ తీవ్రంగా నష్టపోయింది.అయితే టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని బహిష్కరించినా.. భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా పాకిస్థాన్ క్రికెట్ మొత్తం సర్వనాశనమవనుంది. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దాదాపు 348 కోట్ల నష్టపోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ మరో మ్యాచ్‌కు ఉండదు. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తోంది. దాంతో ఈ మ్యాచ్ కోసం బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, అడ్వర్టైజింగ్ కంపెనీలు వందల కోట్లు సంపాదిస్తాయి. భారత్-పాక్ మ్యాచ్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 348 కోట్లు. ఇప్పటికే బ్రాడ్‌కాస్టర్స్ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి.ఒకవేళ ఈ మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తే.. ఆ నష్టాన్ని పీసీబీ నుంచి వసూలు చేయనుంది.

ఇందుకోసం వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు రావాల్సిన వాటాలో కోత విధించనున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పీసీబీకి ఇంత మొత్తం చెల్లించడం కోలుకోలేని దెబ్బనే. కాబట్టి పాకిస్థాన్ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో పాటు అన్ని మ్యాచ్ ఆడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును పీసీబీ ఆలస్యంగా ప్రకటించినా.. టోర్నీలో పాల్గొనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పీసీబీ ఛైర్మెన్ మోహ్‌సిన్ నఖ్వీ తెలిపాడు. తుది నిర్ణయం జనవరి 30 లేదా ఫిబ్రవరి 2న వెల్లడిస్తామని ట్వీట్ చేశాడు.