వాషింగ్టన్ సుందర్ కోలుకుంటాడా ? టీమిండియాకు మరో టెన్షన్

మరోవైపుటీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాను గాయాల భయం వెంటాడుతోంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకునే విషయంలో సమయంతో పోటీ పడుతున్నాడు. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2026 | 07:15 PMLast Updated on: Jan 26, 2026 | 7:15 PM

Will Washington Sundar Recover Another Tension For Team India

మరోవైపుటీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాను గాయాల భయం వెంటాడుతోంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకునే విషయంలో సమయంతో పోటీ పడుతున్నాడు.  యువ బ్యాటర్ తిలక్ వర్మ మాత్రం మెగా టోర్నీకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో, సుందర్ ఫిట్‌నెస్‌పై జట్టు మేనేజ్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుందర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా రెండు వారాల సమయం అవసరమని వైద్య బృందం స్పష్టం చేసింది.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వడోదరలో బౌలింగ్ చేస్తూ సుందర్ ఎడమ వైపు రిబ్ ప్రాంతంలో నొప్పి ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో కేవలం ఐదు ఓవర్లే బౌలింగ్ చేసిన సుందర్, ఆపై మైదానం విడిచిపెట్టాడు. అయితే బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం సుందర్ పూర్తిగా ఫిట్ కావాలంటే ఇంకా రెండు వారాలు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. అతడిని కొనసాగించాలా లేక ప్రత్యామ్నాయాన్ని తీసుకోవాలా అన్నది సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ కలిసి నిర్ణయం తీసుకోనున్నారు.సుందర్ పూర్తిగా కోలుకోకపోతే బ్యాకప్ ఆప్షన్‌గా రవి బిష్ణోయ్‌ను సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది.

మరోవైపు తిలక్ వర్మ విషయంలో గుడ్ న్యూస్ అందింది. పొట్ట భాగానికి శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహ్యాబ్ పూర్తి దశలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమైన తిలక్, తుది టీ20 లేదా నేరుగా వరల్డ్‌కప్‌కు జట్టుతో చేరే అవకాశముంది. ఒకవేళ తిలక్ వర్మ జట్టులోకి వస్తే ఫైనల్ ఎలెవన్ లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లలో ఒకరు బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న సంజూను తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.