వరల్డ్ కప్ జట్టులోకి పరాగ్ ? యువ ఆటగాడికి గోల్డెన్ ఛాన్స్

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాను గాయాల బెడద ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2026 | 07:45 PMLast Updated on: Jan 26, 2026 | 7:45 PM

Parag In The World Cup Squad A Golden Chance For The Young Player

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాను గాయాల బెడద ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ సైతం వేలునొప్పితో బాధపడుతున్నాడు. ఇక వాషీ కోలుకునేందుకు ఇంకా రెండు వారాలకు పైగానే పట్టవచ్చని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే జాతీయ మీడియాకు వెల్లడించాయి. దీనిని బట్టి అతడు వరల్డ్‌కప్‌ టోర్నీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం రియాన్‌ పరాగ్‌ ను రేసులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. భుజం నొప్పిఅసోం ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు.

భుజం నొప్పితో బాధపడుతున్న అతడు గత మూడు వారాలుగా బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ లో పునరావాసం పొందుతున్నాడు. గతేడాది డిసెంబరు 6న చివరగా అసోం తరఫున దేశీ క్రికెట్‌ ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లకు కూడా రియాన్‌ పరాగ్‌ అందుబాటులో లేడు. అయితే, ప్రస్తుతం అతడు వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ నొప్పి లేకపోవడం సానుకూలాంశంగా చెప్పొచ్చు. జనవరి 28, 30 తేదీల్లో అతడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో జనవరి 31న రియాన్‌ పరాగ్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ అయ్యే అవకాశం ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ పరిస్థితి గురించి ఆరా తీసిన బీసీసీఐ.. ఫిబ్రవరి 2న టీమిండియాతో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌గా అతడిని ముంబైకి పిలిచినట్లు సమాచారం. ఒకవేళ వాషింగ్టన్‌ సుందర్ కోలుకోకపోతే.. అతడి స్థానంలో రియాన్‌ పరాగ్‌ను వరల్డ్‌కప్‌ టోర్నీకి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా గువాహటికి చెందిన 24 ఏళ్ల రియాన్‌ పరాగ్‌.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం గల బ్యాటర్‌ అయిన ఈ యువ ఆటగాడు.. రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా. జింబాబ్వేతో 2024 నాటి టీ20 సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రియాన్‌ పరాగ్‌.. చివరగా శ్రీలంక పర్యటనలో వన్డే మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 9 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 106 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు వికెట్లు తీశాడు. ఒకే ఒక్క వన్డేలో 15 రన్స్‌ చేసిన పరాగ్‌.. మూడు వికెట్లు పడగొట్టాడు.