Top story: AI టూల్స్‌ ఎక్కువగా వాడుతున్నారా ? ఈ మెదడులో ఈ భాగం పాడైనట్టే.!

ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ సాధనాలు మానవ జీవితంలో భాగమైపోయాయి. ఒకప్పుడు లెక్కలు చేయడానికి, సమాచారం సేకరించడానికి మనస్సును, మెదడును ఉపయోగించేవాళ్ళం.

Post Published By: dialnews
Updated : 17 September 2026, 4:48 PM IST

ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ సాధనాలు మానవ జీవితంలో భాగమైపోయాయి. ఒకప్పుడు లెక్కలు చేయడానికి, సమాచారం సేకరించడానికి మనస్సును, మెదడును ఉపయోగించేవాళ్ళం. కానీ నేడు చాట్‌జీపీటీ, జెమిని, గ్రోక్, క్లాడ్ లాంటి ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో క్లిష్టమైన ప్రోగ్రామింగ్ కోడింగ్ నుంచి రోజువారీ సందేహాల వరకు అన్నీ ఏఐ చిటికెలో పూర్తి చేసేస్తోంది. విద్యాభ్యాసం, ఉద్యోగం, వృత్తిపరమైన రంగాల్లోనే కాకుండా సామాన్య జీవితంలోనూ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఇటీవల జరిగిన పలు సర్వేల ప్రకారం దేశంలో దాదాపు 65 శాతం మంది ప్రజలు వివిధ అవసరాల కోసం ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ ఏఐ టూల్స్‌ను పరిమితికి మించి అతిగా వినియోగించడం వల్ల మానవ మెదడు పనితీరు, ఆలోచనా శక్తి, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నాయని మానసిక వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏఐ అతిగా వాడటం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లల మెదడు పెరుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. బాల్యంలో మెదడు శీఘ్రంగా అభివృద్ధి చెందే దశలో, పిల్లలు స్వయంగా ఆలోచించకుండా ఏఐ అందించే సిద్ధంగా ఉన్న సమాధానాలపై ఆధారపడటం వల్ల వారిలో సహజసిద్ధమైన ఆలోచనా శక్తి, సృజనాత్మకత నశిస్తున్నాయి. చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకునే ఓపిక, సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించే మానసిక ధైర్యం లోపిస్తున్నాయి. దీనివల్ల 'ప్రీఫ్రంటల్ కార్టెక్స్' భాగం బలహీనపడి, ఏఐ ఆధారిత సమాధానాలకే అలవాటు పడుతున్నారు. ఆన్‌లైన్ తరగతులు, స్మార్ట్‌ఫోన్ల వినియోగానికి అలవాటుపడిన విద్యార్థులు ఏఐ టూల్స్‌కు బానిసలుగా మారి.. పరీక్షల సమయంలో దృష్టి కేంద్రీకరించలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్ల రాకతోనే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ మనుషుల మధ్య సంబంధాలు క్షీణించగా, ఇప్పుడు ఏఐ టూల్స్ అతి వినియోగం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లక్నో.. ఇటీవల 1.57 లక్షల మంది వినియోగదారులపై నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. చాలామంది వ్యక్తులు తోటి మనుషులతో మాట్లాడటం కంటే ఏఐ టూల్స్‌తో వర్చువల్ సంభాషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మనుషులతో సంబంధాలు తగ్గిపోవడం వల్ల భావోద్వేగ అనుబంధాలు దెబ్బతింటున్నాయి. ఏఐ చాట్‌బాట్‌లలో మునిగిపోయి, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని "ఏఐ సైకోసిస్" వంటి తీవ్ర మానసిక రుగ్మతల బారినపడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఏఐ సమాచారాన్ని వేగంగా, క్లుప్తంగా అందించినప్పటికీ, చిన్న చిన్న అవసరాలకు కూడా దానిపై ఆధారపడటం మెదడు పనితీరును మందగించేలా చేస్తుంది. అందుకే విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏఐని ఎంతవరకు ఉపయోగించాలి, ఎక్కడ నియంత్రించాలి అనే దానిపై ప్రతి ఒక్కరికీ స్పష్టత ఉండాలి. భవిష్యత్తులో తీవ్ర మానసిక వైకల్యాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే అవసరం మేరకే ఏఐ టూల్స్, స్మార్ట్‌ఫోన్లను వినియోగించుకోవాలని.. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ అలవాట్లను నిత్యం పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 
  • 17 September 2026, 4:48 PM IST