ఏడాదిలో ఉండే 365 రోజుల్లో ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు. ఒకటో రెండో సంఘటనలు ఒకే తేదీన జరిగితే కాకతాళీయం అనుకోవచ్చు. కానీ, పదే పదే భయంకరమైన దుర్ఘటనలు ఒకే తేదీన జరిగితే ఆ తేదీ వెనక ఓదో కథ ఉందనే అనుమానం అందరికీ వస్తుంది. ఇప్పుడు ‘26’వ తేదీ గురించి కూడా ఇదే చర్చ వినిపిస్తోంది. 26 తేదీ వస్తోందంటే చాలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్‌గా ఆగస్టు 26న నేపాల్‌లోని రసువా జిల్లాలో హిమానీనదం కరిగి బోటేకోశి నదిని వరద ముంచెత్తి వందలాది మంది ప్రాణాలు తీసింది. ఈ విపత్తుతో సోషల్ మీడియాలో మళ్లీ ఒక చర్చ మొదలైంది— "26వ తేదీ అంటే ప్రళయాల తేదీనా ? ఈ తేదీ వస్తే భయపడాల్సిందేనా ?. గతంలో జరిగిన చాలా ప్రమాదాలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. చరిత్ర తిరగేస్తే 26వ తేదీన జరిగిన కొన్ని విషాద సంఘటనలు ప్రపంచాన్ని, ముఖ్యంగా భారత్‌ను వణికించాయి.
డిసెంబర్ 26, 2004లో సునామీ ప్రళయం. ఇండోనేషియాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా వచ్చిన సునామీ భారత్‌తో పాటు పలు దేశాలను ముంచెత్తింది. ఏకంగా 2.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జనవరి 26, 2001లో గుజరాత్ భూకంపం. మన దేశం రిపబ్లిక్ డే వేడుకల్లో ఉండగా గుజరాత్‌లోని భుజ్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల 20,000 మందికి పైగా చనిపోయారు. నవంబర్ 26, 2008లో ముంబై ఉగ్రదాడి. దీన్నే 26 బై 11 అని పిలుస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబై నగరంపై జరిపిన దాడుల్లో 166 మంది నిరుపేదలు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జూలై 26, 2005లో ముంబై ప్రళయ వరదలు. ఒక్క రోజే 944 మి.మీ వర్షం కురిసి ముంబై నగరం స్తంభించిపోయింది. ఈ ఘటనలో 1,090 మందికి పైగా మృతి చెందారు. డిసెంబర్ 26, 2003లో ఇరాన్ భూకంపం. ఇరాన్‌లోని బామ్ నగరంలో ఈ వచ్చిన భూకంపం వల్ల 31,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 26, 2015లో.. హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్‌లలో 400 మందిని పొట్టనబెట్టుకుంది. ఇక 1986లో.. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదాల్లో ఒకటైన చెర్నోబిల్ విపత్తు కూడా 26వ తేదీనే జరిగింది. దీంతో ఈ తేదీ అంటే చాలు ప్రతీ ఒక్కరిలో భయం పట్టుకుంది.
ప్రజల్లో ఈ తేదీపై ఉన్న భయం, ఆందోళనలను సినిమాలు, పాప్‌కల్చర్ కూడా క్యాష్ చేసుకున్నాయి. ముఖ్యంగా భారతీయ సినిమాలో ముంబై దాడుల నేపథ్యంతో రామ్ గోపాల్ వర్మ తీసిన 'ది అటాక్స్ ఆఫ్ 26/11' లాంటి సినిమాలు ఈ తేదీ వెనకున్న భయాందోళనను థ్రిల్లింగ్‌గా చూపించాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా 13, 26 వంటి తేదీలను శాపగ్రస్త రోజులుగా చూపుతూ అనేక డిజాస్టర్, హర్రర్ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఇవి జనాల్లో 26వ తేదీ అంటే అశుభం అనే ఆలోచనను మరింత పెంచాయి. న్యూమరాలజీ ప్రకారం 26 సంఖ్యను కూడితే 8 వస్తుంది. న్యూమరాలజీలో 8వ సంఖ్య శని గ్రహానికి ప్రతీక. శని దేవుడు మార్పులకు, కఠినమైన శిక్షలకు, ఒక్కోసారి అనూహ్య వినాశనాలకు కారణమని నమ్ముతారు. అందువల్లే 26వ తేదీన ప్రకృతి విపత్తులు లేదా ఘోర ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు విశ్లేషిస్తుంటారు.
శాస్త్రవేత్తలు మరియు గణాంక నిపుణులు ఈ వాదనలను శుద్ధ భ్రమ అని కొట్టిపారేస్తున్నారు. కన్ఫర్మేషన్ బయాస్.. అంటే ఒక తేదీని చెడు తేదీ అని బలంగా మనుషులు నమ్మితే.. ఆ రోజు జరిగే చెడును మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. మంచిని మర్చిపోతారంటున్నారు నిపుణులు. ఉదాహరణకు జనవరి 26న మనకు గణతంత్ర దినోత్సవం లాంటి మంచి విషయాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దశాబ్దాల కాలంలో వందలాది విపత్తులు జరుగుతాయి. అందులో ఏదో ఒక తేదీన ప్రమాదాలు పునరావృతం కావడం గణితశాస్త్ర రీత్యా సహజమంటున్నారు నిపుణులు. వాతావరణంలో వచ్చే మార్పులు, భూగర్భ పలకల కదలికలు, మంచు కరగడం వంటి సైంటిఫిక్ కారణాల వల్లే విపత్తులు వస్తాయి తప్ప క్యాలెండర్ లోని '26' సంఖ్య వల్ల కాదు. కాబట్టి 26వ తేదీ అనేది ప్రళయాల తేదీ కాదు, కేవలం కొన్ని యాదృచ్ఛిక సంఘటనల వల్ల ప్రచారంలోకి వచ్చిన ఒక మానసిక భయం మాత్రమేనని చెప్తున్నారు.